జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలం పాతాళానికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగం సైతం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. జనవరిలో జిల్లాలో సరాసరి 7.26 మీటర్ల లోతు ఉన్న జలాలు ఫిబ్రవరి నాటికి 8.01కి పడిపోగా బచ్చన్నపేట లాంటి ప్రాంతాల్లో 9.16.. మరికొన్ని చోట్ల అత్యధికంగా 16.25 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరి డేంజర్ జోన్లోకి వెళ్తోంది.
ఇలా రోజురోజుకూ భూగర్భజలాలు అంతకంతకూ పడిపోతుండడంతో పదేళ్ల కిందట కరువు ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగునీటితో పాటు మరికొద్ది రోజుల్లో తాగునీటికీ తండ్లాడాల్సిన దుస్థితి వస్తుందని ప్రజల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ పాలనలో గోదావరి జలాలతో పుష్కలంగా పారడంతో తీరొక్క పంటలతో కోనసీమలా మారిన జనగామలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో అదునుకు చెరువులు, కుంటల్లోకి నీరు చేరక నేల నెర్రెలు బారి పంటలు ఎండిపోతుండడం రైతును మరింత అగాథంలో పడేసింది.
– జనగామ, మార్చి 3(నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ పాలనలో నిండా గోదావరి జలాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు కళకళలాడేవి. అప్పుడు ఎక్కడ బోరువేసినా కేవలం 30ఫీట్ల లోతులో గంగమ్మ ఉబికివచ్చేది. కానీ ప్రస్తుతం భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా బచ్చన్నపేట ప్రాంతంలో 9.16 మీటర్ల లోతుకు పడిపోగా, పడమటి కేశ్వాపూర్, పోచన్నపేట ప్రాంతంలో 8.13 నుంచి 8.15 మీటర్ల లోతుకు వెళ్లాయి.
స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతంలో 11.57, జనగామ మండలం సిద్దెంకి ప్రాంతంలో 15.66, కొడకండ్లలో 10.21, రఘునాథపల్లి మండలం మేకలగట్టులో 16.25, పాలకుర్తిలో 9.91, వల్మిడిలో 10.52, రఘునాథపల్లిలో 10.5, తరిగొప్పులలో 9.2, అక్కరాజుపల్లిలో 12.18, కూనూరులో 14.75 మీటర్ల లోతుకు పాతాళగంగ జారిపోయింది. 10 మీటర్ల లోతు వరకు పడిపోతే సంబంధిత శాఖ హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 1.60 ఎకరాల్లో వరి వేయగా ఇప్పటికే సాగునీటి కటకటతో 30శాతం పంటలు ఎండిపోగా పదేళ్ల తర్వాత కరువు మళ్లీ తరుముకొస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సకాలంలో పంపింగ్ చేయక..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జనగామ జిల్లాకు దేవాదుల నీటి పం పింగ్ ఆగిపోవడంతో జిల్లాలోని 7 రిజర్వాయర్లకు గానూ నర్మెట మండలం బొమ్మకూరు, లింగాలఘనపురం మండలం నవాబుపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఆర్ఎస్ ఘన్పూర్, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. వర్షపాతం తక్కువగా ఉండే జనగామ ప్రాంతం లో తెలంగాణ వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు నుంచి ఆయా రిజర్వాయర్లకు గోదావరి నీటిని పంపింగ్ చేసి కాలువల ద్వారా చెరువులు, కుంటలు, ఇతర చిన్ననీటి వనరులు నింపిడం వల్ల ఎండాకాలంలోనూ నిండుగా మారి భూగర్భజలాలు సంవృద్ధిగా ఉండేవి.
ఎటుచూసినా పచ్చ ని పంటలతో రికార్డు స్థాయి ధాన్యం దిగుబడితో కోనసీమను తలపించిన జనగామ ఇప్పుడు ఎటుచూసినా నెర్రెలుబారి పొలాలు.. సగం ఎండిన వరి పంటలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ బోర్లు, బావుల్లో నీటి జాడలు అడుగంటి వాటి ఆధారంగా వేసిన వరి పంటలు పొట్టదశలోనే ఎండిపోతున్నాయి. అదునులో మడులకు తడి అందక నెర్రెలువారి పైరు వాలిపోయి పచ్చటి పంటలు కళ్ల ముందే ఎండుతుంటే రైతు గుండె అవిసిపోతున్నది. పూర్తిగా ఎండిపోతే ఎందుకు పనికి రాదని చేసేది లేక పశువులు, జీవాలను మేతకు వదులుతున్నారు. మునుపెన్నడూలేని విధంగా సాగునీటి కోసం జిల్లాలో పలుచోట్ల రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి గోదావరి జలాల తరలింపులో జాప్యంపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ఎండగడుతూ అధికారులను నిలదీస్తున్నారు.
జలవనరుల్లో 25శాతానికి పడిపోయిన నీటిమట్టం
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 953 చెరువులు, కుంటల పరిధిలో 68,962 ఎకరాల ఆయకట్టు ఉంటే వాటిలో 575 వనరుల్లో నీటి మట్టాలు 25శాతానికి పడిపోయాయి. మరో 149 నీటి వనరుల్లో 50శాతం లోపు, ఇంకో 45 నీటి వనరుల్లో 75 శాతం నీరు ఉండగా వందకు పైగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. గతంలో 90 శాతానికి పైగా గ్రామాల్లో నీటి వనరులన్నీ దేవాదుల నీటితో నింపి పంటలకు సాగునీరందడం సహా భూగర్భజల నీటిమట్టం పెరిగి బోర్లు వేసినా.. బావులు తవ్వినా 30 నుంచి 100 ఫీట్ల లోపు నీటి జాడలు ఉబికివచ్చేవి.
ప్రస్తుత యాసంగి సీజన్లో దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోయి, బోరు బావులు వట్టిపోయి వరి, మక్కజొన్న వంటి పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలోని గండిరామారం, బొమ్మకూరు, చీటకోడూరు, నవాబుపేట, ఆర్ఎస్ ఘన్పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్లు సీజన్‌కు ముందు సకాలంలో నింపి వాటి ద్వారా చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేయడంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అదునులో పంటలకు సరిపడా తడులు అందిస్తే భూగర్భజలాలు సైతం లోతుకు పడిపోకుండా నిలకడగా ఉండేవని రైతులు చెబుతున్నారు.
జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, నర్మెట, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్ మండలాల్లో ఇప్పటికే వరి ఎండిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడూ సాగునీటి కటకట ఎరుగని రైతులు ఈసారి పెట్టుబడుల దక్కే పరిస్థితి లేకపోగా తమ కళ్ల ముందే పచ్చటి పంటలను పశువుల మేతకు కోసి వేయాల్సిన దుస్థితి నెలకొనడం కంట నీరు తెప్పిస్తున్నది. దేవాదుల ద్వారా రిజర్వాయర్లు నింపి అక్కడినుంచి గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీటిని తరలిస్తే తప్ప యాసంగి సీజన్ గట్టెక్కేలా లేదు.