కమలాపూర్, సెప్టెంబర్ 15: ధాన్యం కొనుగోలు చేసి ఏడాది కావస్తున్నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యాపారిని రైతులు పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చిన ఘటన మండలంలోని మాధన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన నామిని వెంకటేశ్, కొడుకు రాకేశ్ 2023లో మాధన్నపేటకు చెందిన వంగ సాంబయ్య, ఎగ్గడి శ్రీనివాస్,ఎగ్గడి సాంబయ్య, ఎగ్గడి సదయ్య,
కుమ్మరి భిక్షపతి, కుమ్మరి బాబు, వంగ లింగమూర్తి అనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికి తీసుకెళ్లారు. నెల రోజులు గడిచిపోవడంతో డబ్బులు అడుగగా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా పది నెలలు గడిచిపోయాయి. దీంతో బాధిత రైతులు శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో డబ్బులు ఇస్తానని బాండ్ పేపర్‌మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం స్వగ్రామం ఆముదాలపల్లికి వ్యాపారి వెంకటేశ్ వచ్చిన విషయం తెలుసుకొన్న రైతులు అక్కడికి వెళ్లి అతడిని మాధన్నపేటకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు రాకేశ్ 100 డయల్‌కు కాల్ చేశాడు. దీంతో మాధన్నపేట గ్రామానికి ఎస్సై వీరభద్రరావు సిబ్బందితో కలిసి వెళ్లడంతో రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే తమకు చావే శరణ్యమంటూ రైతులు పోలీసులను వేడుకున్నారు. ఎస్సైఐ రైతులకు నచ్చజెప్పి వ్యాపారి వెంకటేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.