రాయపర్తి, ఆగస్టు 30 : యూరియా బస్తాల కోసం కొద్ది రోజులుగా రైతులు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారుల అలసత్వం, ప్రభుత్వ పర్యవేక్షణ లో పంతో మండలంలోని 40 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులు యూరియా బస్తాల కో సం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయపర్తిలోని పీఏసీఎస్ భవనం, గో దాం ఎదుట బారులు తీరుతున్నారు. శుక్రవారం సొసైటీ భవనం వద్ద యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, ఆటోలు, మోటర్ సైకిళ్లు, ఎడ్లబండ్లతో తరలి వచ్చి కూపన్ల కోసం క్యూలో నిల్చున్నారు.
రాయపర్తి మండల కేంద్రంతో పాటు మైలారం, సన్నూరు, పెర్కవేడు, కాట్రపల్లి, కొండూరు, కొలన్పల్లి, కేశవాపురం, ఊకల్, కొండాపురం, కొత్తూరు తదితర గ్రామాల్లోని ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీ పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బస్తాకు రూ.340-350 వరకు వసూలు చేస్తున్నారని, యూరియా కోసం మరో ఎరువును కొనాల్సిందేనని కొర్రీలు పెడున్నారని మండిపడుతున్నారు.
అసలే వర్షా లు పడక ఉన్న కొద్దిపాటి నీటితో వరి, పత్తి పంట సాగు చేసుకుంటున్న తమకు కనీసం యూరియాను కూ డా సమృద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలో రూ. 275కే యూరి యా బస్తాలను అందజేస్తుండటంతో చేసేది లేక పొద్దంతా క్యూలో నిలబడి కొనుగోలు చేస్తున్నట్లు చెపుతున్నారు. అయితే ఒక ఆధార్ కార్డుకు 5 బస్తాలే ఇస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదంటున్నారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు అధిక ధరలకు విక్రయిస్తు న్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా రోజుకు రెండు లారీల్లో సుమారు 80 టన్నుల యూరి యా బస్తాలను తెప్పించి పంపిణీ చేస్తున్నాం. మండలంలోని రాయపర్తి, ఊకల్, తిర్మలాయపల్లి గ్రామాల్లోని సొసైటీ గోదాముల్లో యూరి యా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. యూరియా కొరత లేనప్పటికీ రైతులంతా ఒకేసారి బస్తాల కోసం వస్తుండడంతో క్యూలు కన్పిస్తున్నా యి. కృత్రిమ కొరత సృష్టించడంతోపాటు లింకు వ్యాపారాలు చేసే వారి వివరాలిస్తే ఆకస్మిక సోదాలు జరిపి దోషులుగా తేలిన దుకాణదారుల లైసెన్స్లు రద్దు చేస్తాం.
– గుమ్మడి వీరభధ్రం, ఏవో, రాయపర్తి