నర్సింహులపేట, డిసెంబర్ 29 : యూరియా కోసం రైతులు బారులు తీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్ద నాగారం రైతు వేదిక వద్ద, మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి సోమవారం యూరియబస్తాలు రావడంతో వివిధ గ్రామానికి చెందిన రైతులు పెద్దమొత్తంలో వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కో రైతుకుకేవలం 2నుంచి 3బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
ఎన్నోరోజులుగా యూరియా కోసం గంటలతరబడి వరుసలో నిల్చొన్నా తక్కువ బస్తాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రైతు వేదికల వద్దకు రైతులు తరలిరావడంతో పోలీసుల పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు. రోజుల తరబడి యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో చేరుకొని సరిపడా యూరియా లభించక ఇబ్బందులు పడ్డారు.