దంతాలపల్లి, మే 29 : బోనస్, మద్దతు ధరకు ఆశపడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే తడిసి ముద్దయి మొలకెత్తడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తేమ శాతం వచ్చిన వడ్లు తడవడంతో ఆరబెట్టలేక అవస్థలు పడుతున్నారు. వరి కోతలు జరిగి నెలన్నర దాటినా మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కాంటాలు పెట్టకపోవడంతో వర్షాలకు తడిసి మొలకెత్తడంలో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
కాంటాలు పెట్టిన బస్తాలు మిల్లులకు తరలించకుండా కొనుగోలు నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. కుమ్మరికుంట్ల కొనుగోలు కేంద్రంలో రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం మిల్లులకు తీసుకవెళ్తే కటింగ్ పేరుతో 4 నుంచి 10 కేజీలు కటింగ్ చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి కటింగ్ చేయకుండా దిగుమతి చేసుకోవాలని వేడుకుంటున్నారు.
కాంటా పెట్టకపోతే చావే శరణ్యం..
వెంటనే ధాన్యం కాంటాలు పెట్టి బస్తాలను మిల్లులకు తరలించకపోతే తమకు చావే శరణ్య మని రైతులు కన్నెర్ర చేశారు. గురువారం పెద్దముప్పారం గ్రామంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశా రు. కష్టపడి పండించిన ధాన్యం నీళ్లపాలు చేస్తరా.. అని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో పోసి 50 రోజులవుతున్నప్పటికీ నిర్వాహకులు నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో ధాన్యం తడిసి రంగు మారి మొలకెత్తిందన్నారు. కలెక్టర్ స్పందించి కాంటాలు పెట్టి బస్తాలను మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
మిల్లులకు ధాన్యం తరలింపు
నర్సింహులపేట, మే 29: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు, వడ్లు కాంటా పెట్టాలని బుధవారం తహసీల్దార్ రమేశ్‌బాబు కాళ్లు మొక్కడం.. తమ బాధలను చెప్పుకొని వేడుకోవడంతో గురువారం అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రంలో కాంటాలు పెట్టిన ఆరు వేల బస్తాల్లో 4వేల బస్తాలను నాలుగు లారీలు, ఒక డీసీఎంలో మిల్లుకు తరలించారు. అదే విధంగా వెయ్యి బస్తాలు కాంటాలు పెట్టినట్లు అధికారులు చెప్పారు. మిగిలిన సుమారు 3 వేల బస్తాలు కాంటాలు పెట్టాల్సి ఉందని, కాంటా పెట్టిన 2 వేల బస్తాలను శనివారం వరకు పూర్తిస్థాయిలో మిల్లులకు తరలిస్తామని పేర్కొన్నారు.
చెరువును తలపించేలా కొనుగోలు కేంద్రం
తొర్రూరు, మే 29: మండలంలోని చర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తున్నది. నిర్వాహకులు సకాలంలో వడ్లు కొనకపోవడంతో వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. వా నకాలం పంట కోసం సన్నద్ధమవుతున్నామని, కానీ యాసంగి పంట ఇంకా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఎమ్మె ల్యే మామిడాల యశస్వినీ రెడ్డి స్వగ్రామంలో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
తరుగు తీయొద్దంటూ రైతుల ఆందోళన
మిల్లర్ క్వింటాకు 5 కేజీల కోత విధిస్తున్నాడని నిరసన
కేసముద్రం, మే 29 : ధాన్యం తూకంలో కోత విధించొద్దంటూ గురువారం మండలంలోని ఓం సాయిరాం రైస్‌మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేశారు. పెద్దవంగర మండలం పోచంపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ఈ నెల 24న లారీలో ఆరుగురు రైతులకు చెందిన 932 బస్తాల ధాన్యం కేసముద్రం మండల కేంద్రంలోని ఓం సాయి రైస్ మిల్లుకు దిగుమతి అయ్యింది. ఒక్కో బస్తాకు 2కేజీల చొప్పున క్వింటాకు 5 కేజీలు కోత విధిస్తున్నామని మిల్లు యాజమానులు కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. వారు చెప్పడంతో గురువారం రైతులు సోమ్లా, బాలాజీ, నీల మ్మ, కొమురమ్మ మిల్లుకు చేరుకోని కోత విధించొద్దంటూ ఆందోళన చేపట్టారు. తడవని ధాన్యానికి ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు అక్కడికి వచ్చి వ్యాపారులతో మాట్లాడడంతో తూకంలో కోత విధించమని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తేమ రాదు.. ధాన్యం కొనరు
బయ్యారం మే 29 : వాతావరణం చల్లబడడంతో ధాన్యంలో తేమశాతం రాక కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. మండలంలోని కొత్తపేటలో పెద్ద చెరువు ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు పంట చేతికి రావడంతో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. వర్షం పడగానే ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పడం.. తెరపివ్వగానే ఆరబెట్టటం నిత్యకృత్యంగా మారింది. రైతులు ప్రతిరోజూ ధాన్యాన్ని ఆరబెట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే నిర్వాహకులు నిబంధనల ప్రకారం 15 నుంచి 17 శాతం మాయిశ్చర్ వస్తేనే కాంటాలు వేస్తామని చెప్పడం తో వర్షం వస్తే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని వెంటనే కాంటాలు అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఆరబెట్టలేక అరిగోస పడుతున్నం..
ప్రతి రోజూ ధాన్యాన్ని ఆరబెట్టలేక అరిగోస పడుతున్నం. చేతికొచ్చిన పంట అమ్ముకునేందుకు వారం క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాం. తేమ శాతం రాకపోవడంతో ఇంకా కాంటా కాలేదు. వర్షం వస్తే టార్పాలిన్లు కప్పి.. లేకపోతే వడ్లను ఆరబెడుతున్నం. ఇలా రోజూ చేయాలంటే రెక్కలు ముక్కలవుతున్నాయ్. వర్షం బాగా వస్తే పూర్తిగా తడుస్తాయోమోనని భయంగా ఉంది. మాయిశ్చర్‌తో సంబంధం లేకుండా కాంటాలు వేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయి.
– భద్రమ్మ, రైతు, కొత్తపేట