నర్సంపేట, జూలై 7 : రైతుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. రోజంతా చివరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వాటితోపాటు నానో యూరియా బాటిల్ అంటగడుతున్నారు. నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మండలంలోని ఇటుకాలపల్లి, గురిజాల, మహేశ్వరం, కమ్మపల్లి వ్యవసాయ గోదాముల్లో సోమవారం ఉదయాన్నే రైతులు యూరియా కోసం బారులు తీరారు. గ్రామాలతోపాటు శివారు పల్లెలు, తండాల రైతులు ఒక్కసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చేరుకున్నారు. లారీ యూరియా లోడ్ దిగుమతి అయ్యే వరకు రైతులు క్యూలో ఉన్నారు. రైతులకు నానో యూరియా అంటగట్టడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పత్తి, మక్కజొన్న, వేరుశనగ తదితర పంటలకు యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈక్రమంలో యూరియా సరిపడ బస్తాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు యూరియా కొరత లేదంటూ వ్యవసాయ అధికారులు మరోవైపు ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం.
ఖానాపురం: స్థానిక పీఏసీఎస్ ఎరువుల దుకాణం ఎదుట సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. పాకాల ఆయకట్టులో ఇప్పటికే రైతులు 30వేల ఎకరాల్లో నార్లు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. మక్కజొన్న రైతులకు యూరియా అవసరం ఉంది. సొసైటీకి 444 బస్తాల యూరియా మాత్రమే రాగా రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలతోపాటు ఒక నానో యూరియాను విక్రయిస్తున్నారు. నానో యూరియా కొనుగోలు చేసే రైతులకే యూరియా బస్తాలు విక్రయిస్తున్నారు. రైతుల సరిపడ యూరియా ఉంచాలని రైతులు కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కోసం క్యూకట్టిన లేవని పలువురు రైతులు వాపోతున్నారు.
నెక్కొండ: స్థానిక పీఏసీఎస్ వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం క్యూ కట్టా రు. కోరినన్న బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం టన్నుల యూరి యా నెక్కొండ సొసైటీకి రాగా సోమవారం మధ్యాహ్నమే అయిపోయినట్లు సొసైటీ సీఈవో మోడెం సురేశ్ తెలిపారు. రెండు ఒక లోడ్ అధికారులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులతోపాటు పక్క మండలాల వారు సైతం ఇక్క డే కొనుగోలు చేస్తున్నారు. సొసైటీల్లో యూరియాకు రూ.270 వెచ్చిస్తూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రైవేట్ పులకు యూరియా సరిగా సరఫరా కావడంలేదు. ఎక్కడైనా ఉంటే మరో రూ.40 ఎక్కువగా ఉంటోందని, అలాగే ఇతర ఎరువులు, పురుగుమందులకు లింక్ పెట్టి విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
పర్వతగిరి: మండలంలోని పీఏసీఎస్ గోదాం వద్ద సోమవారం యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా సరిపడ ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తెల్లవారుజాము నుంచే లైన్ కట్టినా యూరియా పంపిణీకి పర్మిషన్ లేదని సదరు వ్యవసాయ శాఖ అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సరిపడ యూరియా అందించాలని రైతు పెండ్లి రవి డిమాండ్ చేశారు.