కేసముద్రం, నవంబర్ 27 : ధాన్యం పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్లాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వే బ్రిడ్జి కాంటా వేస్తూ తరుగు పేరుతో ట్రాక్టర్కు 40 నుంచి 50 కేజీల వరకు కోత విధిస్తున్నా రు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు నష్టపోతుండగా, మార్కెట్ ఆదాయానికీ గండి పడుతున్నది.
మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తే రూ. 100కు ఒక రూపాయి చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కల్లాల వద్దే క్రయవిక్రయాలు జరుగుతుండడంతో పన్నులు చెల్లించడం లేదు. రైతులు మారెట్లో ధాన్యం విక్రయిస్తే తక్పట్టీ ఆధారంగా వ్యాపారులు డబ్బులు చెకు రూపంలో అందించడం వల్ల భద్రత ఉంటుంది. ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించడంతో వ్యాపారులు వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తున్నారు. పైగా డబ్బులు వెంటనే కావాలని అడిగిన రైతులకు నూటికి రూ. రెండు చొప్పున కోత పెడుతున్నారు.
ఈ ఏడాది మహబూబాబాద్ జిల్లాలో 2.01 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కొంతమంది వ్యాపారులు కల్లాల వద్దే వడ్లు ఖరీదు చేసి గోదాములు, మిల్లుల్లో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ప్రైవేట్ వ్యాపారులు రైతులను మోసం చేస్తూ, ఇష్టానుసారంగా ధాన్యం నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.