అన్ని అర్హతలున్నా రైతులకు రుణమాఫీ కాలేదు. మూడు విడతల్లోనూ వారికి మోక్షం లభించలేదు. చాలా గ్రామాల్లో పావువంతు మందికి కూడా మాఫీ వర్తించలేదు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై రైతులు రగిలిపోతున్నారు. తమకు రుణమాఫీ ఎప్పుడైతదో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమందికే రుణమాఫీ చేసి మిగిలిన వారిని ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి రూ. 2 లక్షలలోపు పంటరుణం తీసుకున్న వారినీ విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ అయ్యిందో? లేదో? తెలియక బ్యాంకులు, వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో మాఫీ చేశామంటూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ బృందం పలు గ్రామాలను సందర్శించగా రైతుల దీనస్థితి వెలుగులోకి వచ్చింది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 18
మొగిలిచర్ల పీఏసీఎస్ ద్వారా రూ.1.40 లక్షల రుణం తీసుకున్న. ఇప్పటి వరకు వడ్డీతో లెక్కించినా రూ. 2 లక్షలు దాటలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీకి నేను అర్హుడిని. అయినా రుణమాఫీ కాలేదు. రెండు, మూడో విడుత జాబితాలోనూ నా పేరు లేదు. గీసుగొండ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగా ఆన్లైన్ ద్వారా పరిశీలించి అర్హత ఉందని, ఎలాంటి సమస్య లేనందున మీకు రుణమాఫీ వర్తిస్తుందని, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. రుణం పొందిన రైతుల్లో అర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపినా కొందరికి రుణమాఫీ చేసి మెజారిటీ రైతులకు మాఫీ చేయకపోవడం మోసం. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– ముక్కల శ్రీనివాస్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం
పరకాల : సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రైతు రుణమాఫీ అంతా మాయ. ఎవరికి మాఫీ అయితాందో తెలుస్తలేదు. నాకు రూ.2.05 లక్షలు రుణం ఉన్నది. రూ.2లక్షలు మాఫీ అయితే రూ.5వేలు కట్టి మళ్లీ రుణం తీసుకోవచ్చనుకున్న. తీరా జాబితాలో నా పేరు లేదు. ఇదేందని అడిగితే రూ.2 లక్షలలోపు రుణం ఉన్నోళ్లకే మాఫీ అయిందని చెబుతున్నరు. నా లెక్క రుణం మాఫీ కానోళ్లు మా ఊర్లో చాలామందే ఉన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం మందికి కూడా రుణమాఫీ చేయలె. వ్యవసాయ అధికారుల దగ్గర కూడా సరైన సమాచారం లేదు. ఇదివరకు రూ.2 లక్షలపైన ఉన్న వారికి కూడా రూ.2లక్షల మాఫీ చేస్తమని చెప్పిండ్రు. అందరికీ రుణమాఫీ చేయకుంటే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతం.
– పల్లెబోయిన సురేశ్, రైతు, లక్ష్మీపురం, పరకాల మండలం
ములుగు : నా పేరు మీద, నా భార్య పేరు మీద జంగాలపల్లి యూనియన్ బ్యాంకులో రూ.లక్షా 70వేల రుణం ఉన్నది. మా ఇద్దరిలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలె. బ్యాంకు పోయి అడిగితే వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో కొడుతే మాఫీ అయితదంటున్నరు. దేవుడా అంటూ ఇక్కడికి కట్టె పట్టుకొని వచ్చిన. వీళ్లను అడిగితే మా దగ్గర ఏమీ లేదు.. బ్యాంకుకు పోయి అడగమంటున్నరు. ఎవరిని అడుగాలో అర్ధం కావడం లేదు. ముసలోన్నని చూడకుండా తిప్పించుకుంటున్నరు. ఇగ నాకు ఓపిక లేదు. అయితే మాఫీ అయితది.. లేకుంటే లేదు. దేవుడే దిక్కు.
– వేల్పుల సమ్మయ్య, రామయ్యపల్లి గ్రామం, ములుగు మండలం
మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ)/ పెద్దవంగర : రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుతల్లో చేపట్టిన రుణమాఫీలో అర్హులైన వందలాది మంది రైతులకు మొండిచేయే దక్కింది. చేసేదేమీ లేక, ఎవరిని అడగాలో తెలియక, మాఫీ ఎప్పుడవుతుందోనని ఎదురు చూస్తున్నారు. బ్యాంక్, వ్యవసాయ అధికారులు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం గ్రామంలో మొత్తం 220 మంది రైతులున్నారు. ఇందులో 150 మంది పంట రుణాలు తీసుకున్నారు.
ఇందులో మొదటి విడతలో 30 మంది, రెండో విడతలో 20, మూడో విడతలో 10, మొత్తం 60 మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. మిగిలిన 90 మందికి రుణమాఫీ కాలేదు. తమకెందుకు మాఫీ కాలేదని బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం రావడం లేదు. అసలు తమకు రుణమాఫీ అయితదా? కాదా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని అర్హతలున్న తమకు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.
నేను 2021లో పెద్దవంగర బ్యాంకులో రూ. 2 లక్షల పంట రుణం తీసుకున్న. ఎన్నికల ముందు కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటిస్తే సంబురపడ్డ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో నా పేరు రాలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంత గందరగోళంగా ఉంది. చేస్తే అందరికీ చేయాలె.. లేకుంటే లేదు.. కానీ ఇట్ల గోస పెట్టొద్దు. నేను రైతును కాదా? పంట కోసం అప్పు తీసుకున్నోళ్లందరికీ మాఫీ చేయాలె. పాత సర్కారోళ్లు చెప్పిన కాడికి అందరికీ రుణమాఫీ చేసిండ్రు. వీళ్లు మాత్రం కొందరికే ఇచ్చి మిగిలినోళ్లకు ఇయ్యమంటే బాగుండదు. మా బాధలను అర్థం చేసుకొని అప్పు మాఫీ చేయాలె.
-తోట విజయ, పోచారం గ్రామం, పెద్దవంగర మండలం
ములుగురూరల్ : ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి కొంత మందికే మాఫీ చేస్తే ఎట్లా? మా లాంటి వారి పరిస్థితి ఏంది కావచ్చు మరి? బ్యాంకులో మేము రూ.2లక్షల రుణం తీసుకున్నాం. మొన్న బ్యాంకుకు పోయి అడిగితే మొత్తం రూ.2లక్షల 20వేలు ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. మీది పైసలు కడుతామని చెప్పినా రుణమాఫీ వర్తించదని అన్నారు. అందరు రైతులను సమానంగా చూసినప్పుడే రుణమాఫీ జరిగినట్లు చెప్పాలి. ఎక్కడిపోయినా పట్టించుకునే వారు లేరు. తిరిగి తిరిగి గోస పడినం. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే ఇలా జరుగుదు. కొందరికే రుణ మాఫీ అయితే మిగతా వారు రైతులు కాదన్నట్లా?
– కన్నబోయిన రాజక్క, జంగాలపల్లి, ములుగు