రేవంత్ సర్కారు అమలుచేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది. గురువారం ముఖ్యమంత్రి అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించగా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాపై స్పష్టత లేకపోవడం, కనీసం వాటిని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించకపోవడంతో రైతాంగం గందరగోళానికి గురవుతోంది. అలాగే సహకార సంఘాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్న రైతులకూ రుణమాఫీ కాకపోవడంపై రైతులు అవాక్కయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఏ నిబంధనలు పెట్టకుండా రుణాలను మాఫీ చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేశారని, ప్రస్తుతం రుణాలు మాఫీ అవుతాయని భావిస్తే చివరికి అప్పులు సొంతంగా చెల్లించే పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
– వరంగల్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పంట రుణాల మాఫీ పథకంపై అంతటా అయోమయం నెలకొన్నది. ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారుల జాబితాలోని పేర్ల వివరాలు ఎవరికీ తెలియకపోవడం గందరగోళానికి గురిచేస్తున్నది. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపొంచారని ప్రభుత్వం పేర్కొన్నా ఎక్కడా అందుబాటులో లేదు. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం జిల్లాలో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లోని రైతు వేదికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు ఎక్కడా రైతులకు అందుబాటులోకి రాలేదు.
గ్రామ పంచాయతీల్లోనూ ఎక్కడా వీటిని ప్రదర్శించలేదు. గ్రామాల వారీగా కాకుండా బ్యాంకుల వారీగా లబ్ధిదారుల జాబితా ఉంటుందని పలుచోట్ల అధికారులు ప్రకటించారు. గ్రామాల్లోని బ్యాంకు బ్రాంచీల్లోనూ ఇది ఎక్కడా అందుబాటులో లేదు. జిల్లాకేంద్రాల్లోని ప్రధాన బ్యాంకు శాఖల నుంచి సేకరించిన సమాచారంతో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ) రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొంచిందని, ఈ వివరాలు తమ వద్ద అందుబాటులో ఉండవని గ్రామాల్లోని బ్యాంకుల అధికారులు చెప్పారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు లేవని పేర్కొన్నారు.
ఒక్కో గ్రామంలోని రైతులు వేర్వేరు బ్యాంకుల్లోని, వేర్వేరు బ్రాంచీల్లో పంట రుణాలు పొందారని, గ్రామాల వారీగా లబ్ధిదారుల సమగ్ర జాబితాలు లేవని చెప్పారు. అయితే ప్రభుత్వం రుణాలను మాఫీ చేసినట్లు తమకు ధ్రువీకరణ రావాలని రైతులు చెబుతున్నారు. పంట రుణాలు తీసుకున్న తమ బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసినట్లు సెల్ఫోన్లకు మెసేజ్ వస్తుందని, అప్పడే తాము మాఫీ అయినట్లు భావిస్తామని రైతులు చెప్పారు. రెండు రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్లి పంట రుణం మాఫీపై స్పష్టత తీసుకుంటున్నామని అన్నారు. రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఏడు నెలల తర్వాత గురువారం నుంచి ఈ ప్రక్రియను చేపట్టింది. మొదటి దశలో లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గ్రామీణ వ్యవసాయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీపై రైతుల్లో ఆందోళన ఉన్నది. ఈ రెండు బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిలో రుణమాఫీకి అర్హుల జాబితాను తయారు చేయలేదు. గురువారం సాయంత్రం ఈ బ్యాంకుల్లో రుణాలు మాఫీ అయ్యే లబ్ధిదారుల జాబితాలను ప్రకటించారు. మొదట ఈ బ్యాంకుల్లోని రుణాలు మాఫీ అవుతాయో, లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
రైతుల వేదికల వద్ద రుణమాఫీపై సంబురాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సంబురాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే పాల్గొన్నారు. పొలం పనుల కారణంగా రైతులెవరూ పెద్దగా హాజరుకాలేదు.
మహబూబాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేసిన రుణమాఫీ జాబితాను చాలామంది రైతుల పేర్లు లేకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే.. జాబితాలో పేరులేకుండా పోయిందని ఆవేదనకు గురయ్యారు. జిల్లాలో 27,249 మంది రైతులకు రూ. 159.65 కోట్లు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారులకు జాబితా అందింది. మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలో సుమారు 200మంది రైతులు రుణాలు తీసుకోగా ఇందులో లక్ష రుణం తీసుకున్న రైతుల సంఖ్య 110మంది వరకు ఉంటుందని అంచనా.
అయితే ఇందులో 15 మందికి మాత్రమే రుణమాఫీ అయినట్లు జాబితా విడుదల చేయడం రైతులను గందరగోళానికి గురిచేసింది. ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తాము రుణమాఫీ కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు ఉంటే ఒకరిది రుణమాఫీ కాలేదు. మరొకరిది బంగారు రుణాన్ని మాఫీ చేయలేదు. ఇలా ఏదో ఒక కొర్రీలు పెడుతూ అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రుణమాఫీ చేయాలని వేడుకుంటున్నారు.
నర్సంపేట, జూలై 18 : వరంగల్ జిల్లాలో కమర్షియల్ బ్యాంక్‌ల ఆధీనంలో పనిచేస్తున్న సొసైటీల్లో చెన్నారావుపేట, ఊకల్, దుగ్గొండి, మందపల్లి సొసైటీలకు ఇప్పటివరకు రుణమాఫీ వర్తించలేదు. వీటిలో 15వేల మందికి పైగా రూ.2లక్షలకు పైగా రుణం తీసుకున్న వారున్నారు. వారిలో ఇప్పుడు మొదట లక్ష రూపాయలు తీసుకున్న వారు 12వేల మంది ఉన్నారు. కానీ, గురువారం మొదటి జాబితాలో మాఫీ అయిన రైతుల పేర్లు లేవు.
ఈ బ్యాంకుల అప్పుల జాబితాలను పరిశీలించేందుకు గత వారం రోజుల నుంచి స్పెషల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.అయినా ఇప్పటివరకు ఈ తనిఖీలు పూర్తి చేయలేదు. వెరిఫికేషన్ పేరుతో రుణాల మాఫీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. ఒక్క చెన్నారావుపేట సొసైటీ నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, గూడూరు మండలాల పరిధిలోని 20 గ్రామాల్లో ఉంది. దీనిలో రెండు లక్షల అప్పులు మాఫీకి అర్హులైన రైతులు 5,768 మంది ఉన్నారు. లక్ష రూపాయల లోపు 4,200 మంది ఉన్నారు. కానీ ఈ సొసైటీలో వెరిఫికేషన్ లంకెతో ఒక్క రైతుకు కూడా మాఫీ జరుగలేదు. కేవలం డీసీసీ బ్యాంకుల పరిధిలోనే ఈ రుణమాఫీ జరిగింది.
ములుగు, జూలై 18(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో 12906 మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్‌చంద్ర తెలిపారు. ఏటూరునాగారం మండలంలో 966, గోవిందరావుపేటలో 1086, కన్నాయిగూడెంలో 1045, మంగపేటలో 1709, వెంకటాపూర్‌లో 2001, వాజేడులో 1058, వెంకటాపురం(నూగూరు)లో 1389మందికి రుణమాఫీ చేయగా ములుగు మండలంలో అత్యధికంగా 2729 మందికి, అత్యల్పంగా సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంలో 923మందికి మొదటి విడుతలో రుణమాఫీ చేసినట్లు డీఏఓ తెలిపారు. రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అన్ని మండలకేంద్రాల్లో గ్రీవెన్సెల్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.