మహబూబాబాద్ రూరల్, జూన్ 23 : మక్కలు, మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని రైతులు ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట కురవి, డోర్నకల్ మండలాల అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు దూదికట్ల కట్టయ్య, బోడ రాంజీ, కోటేష్, వెంకన్న తదితరులు మాట్లాడుతూ పంటలు కొనుగోలు చేసి రెండు నెలలైనా తమకు డబ్బులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
సమయానికి డబ్బులు చేతికందకపోవడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అనేకసార్లు వ్యాపారులను కలిసి అడిగితే పది, ఇరవై రోజులంటూ వాయిదాలు వేస్తున్నారని, ఇప్పుడు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేశారన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల నుంచి డబ్బులిప్పించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.