నమస్తే తెలంగాణ నెట్వర్క్: పంట అవశేషాలను కాల్చొద్దు.. భూమిలోనే కలియదున్నాలని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు రైతులు వినకుండా నిప్పు పెడుతున్నారు. అవగాహన లేకుండా చేసిన చిన్న తప్పిదంతో చుట్టు పక్కల రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్న పైపులు, మోటర్లు, స్టార్టర్లు, కరెంటు తీగలు, పంట ఉత్పత్తులు తగలబడిపోయి, తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కొండాపూర్ గ్రామ పరిధిలోని పాకాల, రంగాయ చెరువులకు గోదావరి జలాలు తరలించే పైప్‌లైన్ సమీపంలో గుర్తు తెలియని ఓ రైతు తన పంట అవశేషాలను కాల్చేందుకు శుక్రవారం నిప్పంటించాడు. వడగాలులు, ఎండల తీవ్రతకు సు మారు 500 ఎకరాల వరకు మం టలు వ్యాపించాయి. దీంతో అనేక మంది రైతులకు చెందిన డ్రిప్ పైపు లు, కరెంట్ మోటర్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు, పంటలకు నీరందించే పైపులు, బోరు మోటర్లు, బోర్లకు సంబంధించిన కేసింగ్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి.
బోయిని యాకయ్యకు చెందిన ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. మంటలను ఆర్పేందుకు అతడు శతవిధాలా యత్నించినా ఫలితం లేకుండాపోయింది. వందల ఎకరాల్లో పంట లు కాలిపోయాయని మాజీ సర్పంచ్ గుబ రాజు వాపోయాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని బంధం చెరువు, పిచ్చిరాంతండా శివారులోని పంటపొలాల్లో శుక్రవారం రాత్రి గుర్తు వ్యక్తు లు నిప్పు పెట్టడంతో సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. తెల్లారితే గాని నష్టం అంచనా వేసే అవకాశం ఉన్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ రైతు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో సమీపంలోని పొలాల్లో వరి కొయ్యలు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెం గ్రామంలో పలువురు రైతుల వ్యవసాయ భూముల్లో వరి కొయ్యలు, మక్కజొన్న కొయ్యలు అంటుకొని సుమారు 400 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. పశువుల దొడ్లు, గడ్డి కట్టలు కాలిబూడిదయ్యాయి. బచ్చన్నపేట మండలంలోని కట్కూర్, వీఎస్నగర్ గ్రామాల శివారులో గుర్తు తెలియని దుండగులు వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. బోరు మోటర్లు, వైర్లు, పైపులైన్లు, పశుగ్రాసం కాలిపోయాయి.