కరీమాబాద్, మార్చి 24 : ఈ నెల 25 నుంచి 27వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనుండగా వరంగల్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ మేళా ఉంటుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
40 రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉత్పత్తులతో ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉద్దేశ్యం, లక్ష్యాలు, విజయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందే వివిధ బ్యాంకు లింకేజీ పథకాలు, నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు.