ములుగురూరల్, నవంబర్ 5 : అడవి పంది దాడిలో రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నం గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి(65) ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్‌పై తీసుకెళ్లి శివాలయం వద్ద దింపాడు. అక్కడి నుంచి నేరుగా తన పత్తి చేను వద్దకు వెళ్లాడు. పంటను పరిశీలిస్తున్న క్రమంలో వెంకట్‌రెడ్డిపై అడవి పంది దాడి చేసింది.
కింద పడిన వెంకట్‌రెడ్డిని ఎడమచేయి భుజం, చేతులు కొరికి తీవ్రంగా గాయపర్చింది. వెంటనే లేచి పరుగెత్తుతున్న వెంకట్‌రెడ్డిపై మళ్లీ దాడి చేయగా, తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న నీటికుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.