నెక్కొండ, ఫిబ్రవరి 18: చేనులో నుంచి కోతులను తరిమికొట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి రైతు మృత్యువాతపడ్డాడు. నెక్కొండ మండలం మడిపెల్లి శివారు తేజావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన తేజావత్ వెంకన్న(42) మంగళవారం మక్కజొన్న చేనులో కోతులు పడకుండా చేనుకు కాపలాగా వెళ్లాడు. ఆయన భార్య సునీత కొద్దిదూరంలోనే చేనుకు కాపలాగా ఉంది.
మధ్యాహ్నం సమయంలో చేనులోకి కోతులు రాగా వాటిని తరిమే క్రమంలో వెంకన్న ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు కేకలు వేయగా భార్య సునీత, గ్రామస్తులు తేజావత్ భరత్, భూక్యా సాగర్, తేజావత్ నరేశ్, తేజావత్ ఆనంద్ వ్యవసాయబావి వద్దకు వెంకన్నను రక్షించేందుకు వెళ్లారు. అప్పటికే వెంకన్న బావిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖిలావరంగల్, ఫిబ్రవరి 18 : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో మంగళవారం బల్దియా పారిశుధ్య కార్మికురాలు గన్నారపు తేజపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఖిలావరంగల్ తూర్పుకోటకు చెందిన కార్మికురాలు విధుల్లో భాగంగా శివనగర్‌లో పారిశుధ్య పనులు చేస్తుండగా కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేయగా చేతికి, కేకలు వేస్తూ తప్పించుకొనే క్రమంలో కిందపడడంతో మోకాలికి గాయమైంది. స్థానికులు కోతులను తరిమికొట్టారు.