నర్మెట, ఫిబ్రవరి 11: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కెర బాలరాజు(38) తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, మక్కజొన్న సాగు చేశాడు. గత సంవత్సరం వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి.
దీనికి తోడు యాసంగిలో పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు పంటలకు తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలనే ఆవేదనకు గురైన బాలరాజు ఆదివారం వ్యవసాయ బావి వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.