వరంగల్, నవంబర్ 21 : వరంగల్ నగరంలో తెలంగాణ వైద్య మండలి అధికారులు వరుస తనిఖీలతో నకిలీ డాక్టర్లకు దడ పుట్టిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డిగ్రీలు చదివి.. వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గురువారం ప్రపంచ పైల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ నేతృత్వంలో సభ్యుల స్టింగ్ ఆపరేషన్‌లో నకిలీ డాక్టర్ల బాగోతాలు బయటపడ్డాయి.
హనుమకొండ హనుమాన్ గుడి వద్ద ఉన్న మారుతి క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ రాకేశ్ బిశ్వాస్ వద్దకు డాక్టర్ నరేశ్‌కుమార్ తన కారు డ్రైవర్‌ను మలం నుంచి రక్తం వస్తుందని పంపించారు. పరీక్షించిన రాకేశ్ బిశ్వాస్ పైల్స్ సమస్య ఉందని, దశల వారీగా తగ్గుతుందని, రూ. 20 వేలు ఖర్చవుతుందని తెలిపారు. పక్కనే ఉన్న డాక్టర్ నరేశ్ కుమార్, యాంటీ క్వాకరీ బృందం సభ్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ అన్వర్‌మియా, డాక్టర్ కూరపాటి రమేశ్ అక్కడికి వెళ్లి సదరు నకిలీ వైద్యుడిని పట్టుకున్నారు. దీంతో బెంబేలెత్తిన సదరు వైద్యుడు చికిత్స చేసేందుకు ఖమ్మం నుంచి మరో డాక్టర్ వస్తాడని చెప్పాడు.
ఖమ్మం నుంచి వచ్చే డాక్టర్‌ను కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడే ఉన్న అనుపమ క్లినిక్‌ను తనిఖీ చేయగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి లేకుండా ఏకే సర్కార్ నాచురోపతి, యునాని చదివి ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. కుమార్‌పల్లిలో నకిలీ ఆయుర్వేద వైద్యుడు బిశ్వాస్ కోల్‌కతాలో ఆయుర్వేద డిగ్రీ చదివినట్లుగా సర్టిఫికెట్ చూపించారు. తెలంగాణ ఆయుష్ కౌన్సిల్, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీలో అనుమతులు లేకుండా సొంతంగా, అశాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేసిన లేపనాలను రోగులకు అందిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద చికిత్స పొందిన వారిలో ప్రముఖ వైద్యులున్నట్లు బృందం సభ్యులు గుర్తించి నివ్వెరపోయారు.
ముగ్గురు నకిలీ డాక్టర్లపై జిల్లా వైద్యాధికారులు, ఆయుష్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మారుతి క్లినిక్ నిర్వాహకుడు రాకేశ్బిశ్వాస్, శ్రీలక్ష్మి క్లినిక్ నిర్వాహకుడు బిశ్వాస్‌పై ఎన్ఎంసీ 34, 54 ప్రకారం కేసులు నమోదు చేస్తామని యాంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు డాక్టర్ శిరీష్ తెలిపారు. కరీమాబాద్‌లో మరో బృందం తనిఖీల్లో అశ్విని క్లినిక్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకుడు డాక్టర్ దిలీప్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ మాట్లాడుతూ నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గోడలపై రాతలు, కరపత్రాల ద్వారా ప్రచారాలు నమ్మి మోసపోవద్దన్నారు.