వరంగల్‌చౌరస్తా, జూలై 17: వరంగల్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న కేసులో మట్టెవాడ పోలీసులు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు గురువారం మట్టెవాడ సీఐ గోపి వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన అమరేందర్ వరంగల్ వేణురావుకాలనీ కేంద్రంగా హనుమాన్ ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 12న టాస్క్‌ఫోర్స్, రెవెన్యూ, మట్టెవాడ పోలీసులు సెంటర్‌పై దాడి చేసి అమరేందర్‌ను మట్టెవాడ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అతడికి సహకరించిన మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నర్సంపేటలోని వైశ్య ఆధార్ నమోదు కేంద్రానికి చెందిన జూలూరి ప్రభాకర్, వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలోని ఆధార్ నమోదు సెంటర్ నిర్వాహకుడు కే సురేశ్‌కుమార్, పరకాలలోని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు వేముల రాజేందర్, హనుమకొండ పద్మాక్షి కాలనీకి చెందిన ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకుడు గొల్లపల్లి శశికాంత్, భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బర్గగూడెంలోని ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఎస్ సాగర్, నల్లబెల్లి మండలంలోని ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకుడు నీరటి రాజేశ్, వరంగల్ చింతల్ ప్రాంతానికి చెందిన నాగపురి లిఖిత్‌కుమార్, వరంగల్ ఎల్బీనగర్ చెందిన జెడ్ ఎన్ ఆన్లైన్ సెంటర్ (ఎల్లమ్మబజార్) నిర్వాహకుడు ఎండీ జుబేర్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ వెల్లడించారు.