హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: ‘తాను ధైర్యంగా, మానసికం గా, దృఢంగా ఉండి క్యాన్సర్‌ను ఎదుర్కొన్నానని సినీనటి గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు క్యాన్సర్ వాకథాన్‌ను ఎంపీ కావ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 2 వేల మంది ఇందులో పాల్గొని ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సినీ నటి గౌతమి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేర్లెస్గా ఉండకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
క్యాన్సర్‌ను ముందుగానే గ్రహించి నాశనం చేయాలన్నారు. సమాజంలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. క్యాన్సర్‌తో ఎంత కష్టపడ్డానో తనకు తెలుసునన్నారు. కరెక్ట్‌గా 20 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలోనే క్యాన్సర్ వచ్చిందని, నాకు ఈ రోజు ఇంకో కొత్త పుట్టినరోజులాగా ఉందన్నారు. ఇప్పుడు 3 కిలోమీటర్లు వాకథాన్ ద్వారా నడిచివచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంత అవగాహన లేదని, అప్పు డు నాకు 32 ఏళ్లని, చిన్న పాప ఉండేదని, పరీక్షలు చేసి చెప్పడానికి కూడా డాక్టర్లు చాలా బాధపడ్డారన్నారు. ఎప్పుడు ఏ విధంగానైనా క్యాన్సర్ రావచ్చునని, మానసికంగా ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు న్యూట్రిషనల్ ఫుడ్ అందించాలని కోరారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తే ఎలాంటి రోగాలు రావ ని, అందరూ నిండుగా హ్యాపీగా బతకాలని గౌతమి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలు డాక్టర్ హరిణి, ప్రతిమ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ రమేశ్, డైరెక్టర్లు డాక్టర్ ప్రతీక్, డాక్టర్ రాహుల్, డాక్టర్ అవినాష్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.