మరో పదిరోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్-19వ సీజన్‌కు ముందు ఆరంభ మ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లకు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఈ జట్లకు ఆడుతున్న ఆస్ట్రేలియా పేస్ ద్వయం పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవనున్నారని తెలుస్తున్నది. గత రెండు సీజన్లుగా ఎస్ఆర్హెచ్కు సారథిగా వ్యవహరిస్తున్న కమిన్స్.. వెన్ను గాయం కారణంగా నిరుటి యాషెస్ సిరీస్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతడింకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక తొడ కండరాలు, కాలి మడమ గాయంతో ఐదునెలలుగా ఆటకు దూరమైన హాజిల్‌వుడ్ సైతం ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. ఐపీఎల్ రెండో అంచెలో ఈ ఇద్దరూ ఆయా జట్లతో కలిసే అవకాశమున్నట్టు వార్తలొస్తున్నాయి.

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందడి మొదలైంది. మరో పది రోజుల్లో మొదలుకానున్న 19వ సీజన్ కోసం జట్లన్నీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నాయి. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు సన్నాహాలు షురూ చేశారు. దేశవాళీ క్రికెటర్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో చెమటోడుస్తుండగా, అంతర్జాతీయ క్రికెటర్లు తమ తమ ఫ్రాంచైజీలతో చేరుతున్నారు. సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీకి హాజిల్‌వుడ్ రూపంలో ఎదురుదెబ్బ తాకగా, ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. గత సీజన్ల లాగే చెన్నై ఐకాన్ ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వెలువడుతుండగా, ‘ముంబై చా రాజా’ రోహిత్‌శర్మ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో తన బంధాన్ని తెంచుకున్న చెటా సంజూ శాంసన్..ఈసారి చెన్నై తరఫున అదరగొట్టేందుకు సై అంటున్నాడు.

తన కెరీర్ ఆరంభం నుంచి నిరుటి సీజన్ దాకా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన మాజీ సారథి సంజూ శాంసన్ ఆ జట్టును వీడటానికి గల కారణాలపై తొలిసారిగా నోరువిప్పాడు. శాంసన్ మాట్లాడుతూ.. ‘రాజస్థాన్ ఆటగాళ్లు, కోచింగ్, ఇతర సహాయక సిబ్బందిలో చాలామందితో నాకు సత్సంబంధాలున్నాయి. నా కెరీర్లో రాయల్స్‌కు వ్యతిరేకంగా ఆడుతుండటం ఇదే మొదటిసారి. కానీ మైదానంలో భావోద్వేగాలు నా ఆటను ప్రభావితం చేయలేవు.
రాయల్స్‌లో నా సమయం ముగిసిందని నేను భావించా. అందుకే ఆ జట్టు నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు మేం ముఖాముఖి ఎదురుపడితే నేను మిగతా ప్రత్యర్థుల మాదిరిగానే ఆ జట్టుపై అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని తెలిపాడు. ఐపీఎల్ సీజన్ వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా చెన్నైకి మారిన ఈ కేరళ స్టార్.. సూపర్ కింగ్స్ మాజీ సారథి ధోనీ నుంచి నేర్చుకునేందుకు ఇది తనకు చక్కని అవకాశమని చెప్పాడు.