ఏటూరునాగారం, జూన్ 10 : పంటలు సాగు చేసే భూముల కంటే ఇసుక మేటలు వేసిన పట్టా భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నది. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు కౌలు చెల్లించేందుకు దళారులు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గు చూపుతున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో మూడేళ్లుగా ఇసుక మేటల తొలగింపును అటవీశాఖ అధికారులు అడ్డుకున్నా, ఇటీవల మళ్లీ మొదలైంది. రెండు నెలల నుంచి తొలగింపు ప్రక్రియ జోరుగా సాగుతుండడంతో దళారులు, కాంట్రాక్టర్లు అలాంటి భూముల కోసం వెతుకుతున్నారు. మొదట కాంట్రాక్టర్లు, దళారులు ఇసుక మేటలు వేసిన భూములున్న రైతులతో ఒప్పందం కుదుర్చుకొని, ఇసుక మొత్తం తీసేవరకు అనుమతి పొందుతారు. ఇందుకు ఏడాది నుంచి మూడేళ్లు పట్టే అవకాశం ఉన్నది. గతంలో ఎకరానికి రూ.80వేల వరకు కౌలు చెల్లించగా, ఈ ఏడాది తాజాగా రూ.లక్ష వరకు ఇస్తామంటూ రైతులతో అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. అయితే, కొంతమంది దళారులు కౌలుకు తీసుకుని డబ్బులు సరిగ్గా చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండడంతో అనేక చోట్ల రైతులు ఇసుక తొలగింపును అడ్డుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన భూములు ఉన్నాయి. జంపన్నవాగుతో పాటు అనేక వాగులు, గోదావరి కోతకు గురైన భూములు ఇసుక మేటలతో ఉన్నా యి. పంట భూముల్లో వేసిన ఇసుక మేటలను తొలగించేందుకు రైతులకు ఆర్థిక స్థోమత లేని కారణంగా దళారులపై ఆధారపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇసుక మేటల తొలగించుకోవడం వల్ల నేల బయటపడితే మళ్లీ వ్యవసాయం చేసుకునే అవకాశం కోసం అనుమతి ఇస్తుంది. కానీ, అంతా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నది. 10 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్వినా మట్టి రావడం లేదు. ఇసుక తొలగించిన తర్వాత తిరిగి వ్యవసాయం చేసుకునేందుకే అనుమతి ఇస్తున్నప్పటికీ ఎక్కడ ఎకరం భూమి కూడా సాగులోకి రాలేదు. ఇసుక మేటల తొలగింపు పేరుతో జరిగే దందాలో స్థానికంగా కొందరు దళారులు జోక్యం చేసుకుని బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. దీంతో రైతుల కంటే దళారులే లక్షల్లో లాభపడుతున్నారు. ఇక రైతులకు సకాలంలో కౌలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న వారు కూడా ఉన్నారు.
తవ్వకాల్లో అక్రమాలు
ఇసుక మేటల తొలగింపు పేరుతో నిర్వహించే క్వారీల్లో కొందరు కాంట్రాక్టర్లు, దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక మేటల తొలగింపునకు రెవన్యూ అధికారులు ఉమ్మడి సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు.అయితే, కొందరు దళారులు, కాంట్రాక్టర్లు అనుమతి పొందిన భూమిలోనే కాకుండా వాటి పక్కన ఉన్న భూముల్లో కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా టీఎస్ఎండీసీ, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఈ దందా ఎక్కువగా జరుగుతున్నది. అనుమతి లేకుండా అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి ఇసుక తీసుకునేందుకు అలవాటు పడిన కాంట్రాక్టర్లు కౌలు ధరలు పెంచేస్తున్నారు. మీటరు లోతు కంటే ఎక్కువ ఇసుక తీయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతుండడంతో భూ గర్భజలాలు అడుగంటిపోతున్నా యి. ఇంత జరుగుతున్నా అధికారుల తనిఖీలు అంతంత మాత్రమే.
వేలల్లో కౌలు.. లక్షల్లో వసూలు
ఇక కౌలు ధర తక్కువగా చెల్లించి అనుమతి వచ్చిన తర్వాత క్వారీల్లో ఇసుక అమ్ముకొని కాంట్రాక్టర్లు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇసుక మేటల తొలగింపు పేరుతో నిర్వహించే క్వారీకి అనుమతి వచ్చిన తర్వాత టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక అమ్మకాలు కొనసాగుతాయి. రైతుల పేరుతోనే అనుమతి పొందినా తర్వాత కాంట్రాక్టర్లదే ఇష్టారా జ్యం. పేరుకే రైతు.. అంతా కౌలుదారులదే పె త్తనం. రైతుల తరఫున కాంట్రాక్టర్లు యంత్రాలను సమకూర్చుతారు. క్వారీ నడిచే సమయంలో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యే లావాదేవీలు నడుస్తుంటాయి. లారీకి లోడింగ్‌కు చార్జీలు అదనమంటూ రూ.3,500 చొ ప్పున దొడ్డిదారిన వసూలు చేస్తున్నారు. ఇలా ఆయా క్వారీల్లో ఉన్న ఇసుక నాణ్యతను బట్టి కాంట్రాక్టర్లు కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా అక్రమంగా డబ్బు సంపాదించే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ఇసుక క్వారీలు పొందేందుకు పోటీ పడుతున్నారు. ఏపీ, హైదరాబాద్‌కు చెందిన కొందరు పెట్టుబడిదారులు ఇసుక క్వారీల్లో భాగస్వాములవుతున్నారు.