వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : అర్హత ఉన్నప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అధిక శాతం గ్రామాల్లో మెజారిటీ రైతులు మూడు విడుతల్లోనూ రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ గ్రామాల్లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని రెడ్డిపాలెం ఒకటి. ఇక్కడ రుణం పొందిన రైతుల్లో పాతిక శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. అర్హత కలిగినా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో మిగత డబ్బు ఐదు శాతం మంది ఆందోళన చెందుతున్నారు. రెడ్డిపాలెం గ్రామం లో మొత్తం 92 మంది రైతులుండగా, వీరిలో 30 మంది పొరుగున ఉన్న మొగిలిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) నుంచి రుణం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువులోపే రుణం తీసుకున్నందున తమకు మాఫీ వర్తిస్తుందని వారు మురిసిపోయారు. అయితే మూడు విడుతల్లో జరిగిన రుణమాఫీ జాబితాలో కేవలం 8 మంది పేర్లు మాత్రమే చోటుచేసుకున్నాయి. మిగతా 22 మందికి మాఫీ కాలేదు. తమకు అర్హతలన్నీ ఉన్నా మాఫీ జాబితాలో తమ పేర్లు ఉండకపోవటాన్ని ఈ రైతులు నిరసిస్తున్నారు. వడ్డీతో సహా లెక్కించినా ఈ 22 మంది రైతుల రుణం రూ.2 లక్షలు దాటడం లేదు. ఆధార్ నంబర్, పేరు వంటి తప్పులు లేవు.
రేషన్‌కార్డు, ఒకే కుటుంబంలో ఒకరికే రుణమాఫీ, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ తదితర నిబంధనలను పరిగణలోకి తీసుకున్నా వీరందరికీ అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ వర్తించకపోవటానికి కారణమేమిటనేది వీరికి అంతుచిక్కటం లేదు. ఇదే విషయమై మొగిలిచర్ల పీఏసీఎస్, వ్యవసాయశాఖ అధికారులను కలిశారు. రైతుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను పరిశీలించిన అధికారులు అర్హత ఉన్నందున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రుణమాఫీ వర్తించనుందని చెబుతున్నారు. సర్కారు అర్హులకు రుణమాఫీ చేయకపోవటం మోసమని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని రైతులు తెలిపారు.