బెల్ట్ తీస్తలేరు !
బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్ షాపులు లేకుండా ఒక్కొక్కరి బెల్ట్ తీస్తాం’ అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసెత్తడంలేదు.
- జనగామ జిల్లాలో ఏరులైపారుతున్న మద్యం
- బెల్ట్ షాపుల్లోనే దొరుకుతున్న గుడుంబా?
- ఆచరణకు నోచుకోని కాంగ్రెస్ సర్కార్ హామీ
- తనిఖీల పేరుతో కొందరి దందాలు
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
జనగామ, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్ షాపులు లేకుండా ఒక్కొక్కరి బెల్ట్ తీస్తాం’ అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసెత్తడంలేదు.
పైగా స్థానిక అధికార పార్టీ నాయకుల అండతో గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, యథేచ్ఛగా బెల్ట్ షాపుల దందా సాగుతుంటే అడ్డుకోవాల్సిన ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వారి నుంచి నెలనెలా మామూళ్లు సర్ధుబాటవుతుండడంతో యంత్రాంగం వాటి జోలికి వెళ్లడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుడుంబా తయారీ, అమ్మకాలపై ఆధారపడిన కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యేక పథకంతో ఉపాధికి భరోసా కల్పించింది. ఫలితంగా గుడుంబా తయారీ, విక్రయాలు నిలిచిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే..
నిరుపేదలు, దినసరి కూలీలను గుడుంబా మహమ్మారి కబళిస్తుంటే.. బెల్ట్‌షాపులు మాత్రం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక స్థితిని తల్లకిందులు చేస్తున్నది. బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే అదనపు ధరలకు మద్యం విక్రయిస్తూ జేబులు గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా గుడుంబా ప్యాకెట్లను సైతం అమ్ముతున్నట్లు తెలిసింది. ఇది వరకు గ్రామాల్లో రాత్రిపూట అమ్మకాలు జరిగితే ఇప్పుడు బార్లు, వైన్ షాపులను తలపించేలా సిట్టింగ్లతో 24 గంటలు తెరిచే ఉంటున్నాయి.
జనగామ జిల్లాలో 47 మద్యం షాపులు, ఐదు బార్లు ఉండగా, ప్రతిరోజూ సుమారు రూ.1.50 కోట్ల మేర మద్యం, బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. వీటికి దీటుగా అనధికారికంగా దాదాపు 1,500 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో సైతం విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపుల్లోనూ రోజూ రూ. లక్షల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. జనగామలో 11 మద్యం షాపులకు తోడు 25 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయంటే.. వాటి ప్రాధాన్యతను అర్ధ్థం చేసుకోవచ్చు.
ఎమ్మెల్యే పల్లా అల్టిమేటం
ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో డీసీపీ, అదనపు కలెక్టర్ సమక్షంలోనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బెల్ట్ దందాపై గళమెత్తారు. పట్టణంలోని ప్రభుత్వ, పోలీసు కార్యాలయాల ఎదుటే బెల్ట్ షాపులు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమీకృత కలెక్టరేట్‌కు పక్కనే అర్ధరాత్రి వరకు మద్యం దుకాణంలో పర్మిట్రూం, అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్నా ఎవరికీ కనిపించడంలేదని మండిపడ్డారు.
బెల్ట్ షాపులు లేని జనగామ నియోజకవర్గంగా మార్చడం లక్ష్యంగా వారం, పదిరోజుల్లో అధికారులు అన్నింటినీ మూసివేయకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగి మహిళలతో ఉద్యమిస్తామని అల్టిమేటం జారీచేశారు. ఇప్పటికే పలు గ్రామాలు, పట్టణంలోని వీవర్స్‌కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మహిళలు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.
సిండికేట్ దందా..
జనగామ జిల్లాలో లిక్కర్ వ్యాపారులు సిండికేట్‌గా మారి బెల్ట్‌షాపుల దందాకు తెరలేపారు. వీరికి ఎక్సైజ్‌శాఖ అండదండలుండడంతో గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం ఏరులైపారుతున్నది. జనగామ పట్టణ శివారులోని నెల్లుట్లలో మూడు మద్యం దుకాణాలుంటే అందులో ఒకటి ప్రత్యేకంగా గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు మందు సరఫరా చేసేందుకు కేటాయించడం గమనార్హం. దీనికి తోడు మద్యం వ్యాపారులు బాటిళ్లపై ప్రత్యేక స్టిక్కర్లు వేసి బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తుండడం విశేషం. సిండికేట్ వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు బెల్ట్ షాపులకు అమ్ముతుండగా, క్వార్టర్ బాటిల్‌పై రూ.40, ఆఫ్‌కు రూ. 80, ఫుల్‌కు రూ.160 వరకు పెంచి వారు విక్రయిస్తున్నారు.
తనిఖీలతో సిబ్బంది దందాలు..
దసరా సందర్భంగా జనగామ జిల్లాకు గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) లిక్కర్ వచ్చిందనే సమాచారంతో కొన్ని చోట్ల ఆకస్మిక తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది వసూళ్ల దందాకు తెరలేపారని తెలుస్తున్నది. ఒకటి, రెండు బాటిళ్లు దొరికినా భయపెట్టి, బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దసరా ముందురోజు హనుమకొండ హైవేపై యశ్వంతపూర్ వద్ద ఓ హోటల్లో మద్యం తాగుతున్న యువకులను బెదిరించి వారి వద్ద ఉన్న మద్యం, బీరు బాటిళ్ల పెట్టెలను తీసుకెళ్లిన ఎక్సైజ్ అధికారులు ఆ తర్వాత కేసు పెడతామంటూ యువకులతో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ శాఖలోని అవినీతి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

