ఖిలా వరంగల్, మార్చి 24 : గుప్త నిధుల పేరిట ఓ ఇంటిలో తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రులు పూజలు, తవ్వకాల శబ్దాలు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షద్ర పూజలు చేస్తున్న మాంత్రికులతోపాటు ఇంటి యజమానులను పోలీసు స్టేషన్‌కు తరలించిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి ఖిలావరంగల్ తూర్పుకోటలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే తూర్పుకోటకు చెందిన పండ్ల వ్యాపారి జీ శ్రీనివాస్ తన ఇంటిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.
వారం రోజలుగా తవ్వుతూ సొరంగం చేశారు.
అలాగే క్షుద్రోపాసకులు రాత్రులు పూజలు చేస్తుండడంతో భయ బ్రాంతులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే పూజలు చేస్తున్న సమయంలో సుంగంధ ద్రవ్యాల వాసనలకు అనుమానంతో స్థానికులు సునీత, లక్ష్మి, కవిత, దేవేంద్ర, అనిత తదితరులు మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులను చూసి కొంత మంది పారిపోగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాలతో క్షుద్రపూజలతో భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చట్ట రిత్య చర్య తీసుకోవాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.