జనగామ, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : టీ-పీసీసీ తొలి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం జనగామ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వెంట హెలికాప్టర్లో వచ్చిన పొన్నాలను సభా వేదికపై పక్కనే కూర్చోబెట్టుకొని తొలుత గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. జనగామ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్‌లీడర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మరో బీజేపీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్, మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ చైర్మన్, పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు సీహెచ్ రాజమౌళి, జనగామ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నాయకులు, చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య పంతులు, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ ఇక్బాల్, నర్మెట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిటి అంజయ్య, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ మాజీద్, కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగె గురువయ్యగౌడ్, నర్మెట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వెల్దండ సర్పంచ్ నర్ర రమణారెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రమల్ల లక్ష్మణ్, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్, చేర్యాల మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు, దానంపల్లి సర్పంచ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, చేర్యాల మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు కుర్రపాటి మధు, కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సల్తాన్ గోవింద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరాబు మధు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు సౌడ మహేశ్, జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రావుల రాజేశ్గౌడ్ను పొన్నాల లక్ష్మయ్యతోపాటు సీఎం కేసీఆర్ స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
జనగామ బీఆర్ఎస్లో కొత్త ఊపు..
హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట హెలికాప్టర్లో వచ్చిన పొన్నాల జనగామ ప్రజా ఆశ్వీర్వాద సభలో అధినేత సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆయనతోపాటు వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సహా జనగామ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్‌లీడర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్, బీజేపీలో కలకలం రేపుతున్నది. కాంగ్రెస్‌లో 45 ఏళ్లసుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న పొన్నాల టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఏఐసీసీ పెద్దల తీరుపై అసహనంతో పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన జనగామ గడ్డపైనే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్లో చేరడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. న వంబర్‌లో ఎన్నికలున్న తరుణంలో పొన్నాల సహా బీ జేపీ సీనియర్ నాయకులు చేరడంతో బీఆర్ఎస్ అభ్యర్ధికి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అదనపు బలం చేకూరినట్లయింది.