నర్సంపేటరూరల్, మే 20: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు, కొనుగోలు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు. 24గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించడంతో దిగుబడి పెరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు రైతులు సహకరించాలని కోరారు. ఈ సంవత్సరం యాసంగిలో లక్ష 21వేల ఎకరాల్లో పంట సాగు చేశారని, పాకాల-రంగాయ, మాధన్నపేట చెరువులను గోదావరి జలాలతో నింపడం వల్లే అధిక విస్తీర్ణంలో సాగు సాధ్యమయిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 92 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు లారీలతో పాటు ఇతర వాహనాల సంఖ్యను పెంచాలని సూచించారు. రైస్ మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్ల జారీ ప్రక్రియ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు ఏజెన్సీలు, అధికారులు, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కోట శ్రీవత్స, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, డీసీవో సంజీవరెడ్డి, డీఎం సివిల్ సప్లయ్ పీవీఎన్ ప్రసాద్, జేడీఏ ఉషాదయాళ్, డీఎం మార్క్‌ఫెడ్ మహేశ్, డీఆర్డీవో సంపత్‌రావు, ఏసీపీ సంపత్‌రావు పాల్గొన్నారు.