జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరమ్మతు చేస్తామని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావాలని పక్కన పెట్టారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రెండున్నరేళ్లు రైతులను కష్టపెట్టారని, వారి పాపం తప్పక తగులుతుందని ఆయన అన్నారు. శనివారం బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా బృందం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు.
ఎర్రబెల్లితో పాటు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ య్య, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బా నోత్ శంకర్‌నాయక్, అరూరి రమేశ్, దాసరి మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని ప్రాజెక్ట్ సమీపంలో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అసలు ప్రాజెక్టులో ఏం జరుగుతున్న ది? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంకా ఎన్నేళ్లు బరాజ్ ను బలిపెడతారు? అని నేతలు మండిపడ్డారు. ఎంత చెప్పినా వినకుండా కేవలం ఐదు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతించడంతో ముఖ్య నేతలు వాహనాల్లో వెళ్లగా, మిగిలిన శ్రేణులు ఎండలో సుమారు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ బరాజ్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై కేసీఆర్ అంటూ నినదించారు.
సీఎం పర్యటనలోనూ పోలీసులు ఇలాగే వ్యవహారించాలని డిమాండ్ చేశారు. బరాజ్ సందర్శన అ నంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్టాల్లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కట్టిందని, కానీ గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం 10 అక్రమ ప్రాజెక్టులు కట్టి తెలంగాణను ఎడారి చేసిందని, ఈ పాపం కాంగ్రెస్‌దేనన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిపై ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్‌కు నిద్రపట్టడం లేదన్నారు.
మహదేవపూర్ : మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచమే అబ్బురపడేలా నిర్మించిన కాళేశ్వరాన్ని అనేక అబాసు పాలు చేయాలని, కేసీఆర్ కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతీయాలని చూసింది. కాళేశ్వరం కూలిందని ప్రపంచానికి అబద్ధాలు చెప్పింది. రెండున్నరేళ్లుగా కాలయాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రైతుల ఆగ్రహంతో దిగివచ్చి కాళేశ్వరాన్ని సందర్శించడానికి వస్తున్నడు. ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సందర్శించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో సాగు, తాగు నీటి కొరత లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. చిన్న కుంగుబాటు కారణంతో బరాజ్‌ను పక్కన పెట్టడంతో రైతులు గోసపడుతున్నరు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు జరిగే నష్టమేమీ లేదు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం.
– దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ
మహదేవపూర్ : రెండున్నరేళ్లుగా మేడిగడ్డ బరాజ్‌ను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి రై తుల నోళ్లు కొట్టిండు. నిర్మాణ సంస్థకు గ్యారెంటీ పీరియడ్ ఉ న్నా కావాలనే బరాజ్‌కు మరమ్మ తు చేయించలేదు. కేసీఆర్‌పై రే వంత్‌రెడ్డి అసత్య ప్రచారాలు చే స్తూ కుట్రలు పన్నుతున్నడు. ఈనెల 20న సీఎం మేడిగడ్డ పర్యటనకు గల కారణాలేంటి? ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రయత్నాలు చేస్తున్నడు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేరు సాధ్యంకాదన్నరు. ఇప్పుడు స్వచ్ఛమైన గోదావరి నీటిని హైదరాబాద్ ప్రజలకు తాగిస్తున్నామని అంటున్నరు. మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నయ్? ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎండబెట్టారు? సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇసుక దందా, కమీషన్ల కోసమే బరాజ్‌ను పక్కకు పెట్టినట్లు ప్రజలకు
స్పష్టంగా అర్థమతున్నది.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే, వర్ధన్నపేట
మహదేవపూర్ : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడం చేతగాక నాటాకాలు ఆడుతున్నది. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైంది? మహిళలకు రూ. 2,500 ఎక్కడికి పోయినయ్? అన్నం పెట్టే రైతుకు మోసం చేసే చరిత్ర రేవంత్‌రెడ్డిది. రాష్ట్రంలో ఎక్కడ భూములు కనిపిస్తే వాటిని అమ్మడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదు. నాడు కేసీఆర్ హయాంలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులు నేడు అరిగోస పడుతున్నరు. రాష్ట్రంలో కేసీఆర్ అనవాళ్లను ఎవరూ చెరపలేరు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నరు.
– శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్
మేడిగడ్డ బరాజ్‌లో చిన్న క్రాక్‌లు ఏర్పడిన రెండు పిల్లర్లకు మరమ్మతు చేస్తే అది ఉపయోగంలోకి వస్తుంది. కావాలనే రేవంత్ ప్రభుత్వం కక్షకట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే కేవలం మేడిగడ్డకే రూ. లక్ష కోట్లయ్యాయని రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నడు. రెండున్నరేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని రేవంత్ ఇప్పడు హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? పుష్కరాల పనుల్లో చీవాట్లు పడడంతోనే మేడిగడ్డను ముందుకు తెచ్చి డైవర్షన్ చేస్తున్నాడు. మేడిగడ్డ పర్యటనకు గల కారణాలు ఏం టి? రెండున్నరేళ్లు ఎందుకు కాలయాపన చేశారు? అనేది ప్రజలకు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పి పనులు ప్రారంభించాలి.
– పుట్ట మధుకర్, మాజీ ఎమ్మెల్యే, మంథని
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి జలాలను బీడు భూములకు మళ్లించిన కేసీఆర్ తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చేశారు. రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారు. 2023లో మేడిగడ్డ పిల్లర్లు కొంత మేరకు క్రాక్ రాగా దాన్ని రిపేరు చేయకుండా రెండున్నరేళ్లుగా రాజకీయం చేస్తున్నడు. ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొస్తే కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనేది కాంగ్రెస్, బీజేపీ బాధ. రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డికి రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో జ్ఞానోదయమైంది. ఇప్పుడు మేడిగడ్డ బాట పడుతున్నడు. ఎల్అండ్టీ అనాడే మరమ్మతు చేస్తామని చెప్పినా కావాలనే కమీషన్లు, విచారణల పేరుతో కాలయాపన చేశారు. అసెంబ్లీలో శ్రీధర్‌బాబు కాళేశ్వరం జలాలను మూసీకి తరలిస్తామని చెప్పాడు. అలాంటప్పుడు 30 నెలలుగా బరాజ్‌ను ఎందుకు పునరుద్ధరించలేదు. సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
– గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భూపాలపల్లి
ఎన్నికల సమయంలో మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ రైతులు, ప్రజల కొంప ముంచింది. ఆ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నరు. తెలంగాణ రాక ముందు, వచ్చాక పరిస్థితి ఎలా ఉందనేది ప్రజలు గమనించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఊహించని అభివృద్ధి చేసింది. గోదావరిని ఒడిసి పట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్లు మళ్లించారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను మించిపోయింది. ప్రాజెక్టులు అన్నప్పుడు సమస్యలుంటాయి. సరిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలు వస్తే కేసీఆర్ సరిచేసి ఉపయోగంలోకి తీసుకొచ్చారు. రాజకీయం చేయలేదు. జగిత్యాల సభ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి మేడిగడ్డ టూర్ పెట్టుకున్నడు. అసలు ఎందుకు వస్తున్నాడో క్లారిటీ ఇవ్వాలి.
– గండ్ర జ్యోతి, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు
మహదేవపూర్ : మేడిగడ్డ బరాజ్‌ను మంత్రుల బృందం సందర్శించి కేసీఆర్‌పై బుదరజల్లే ప్రయత్నం చేయడం తప్ప చేసేదేమీ లేదు. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉండడంతో ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో పుష్కలంగా సాగు నీరంది ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసే పరిస్థితి రావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు మాటలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల మేలు కోసం అడుగులు వేయాలి. బీఆర్ఎస్, కేసీఆర్‌పై కుట్రలు మానుకోవాలి.
– మాలోత్ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్
మహదేవపూర్ : తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి రైతులకు సాగు నీరందించిన గొప్ప మహనీయుడు కేసీఆర్. సీఎం రేవంత్‌రెడ్డి విధ్వంస పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేసీఆర్ కట్టించిన బరాజ్‌లు కూలిపోవాలి.. లేదంటే తానైనా కూలగొట్టాలి అన్నట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నడు. ఎస్ఎల్బీసీలో 8 మంది సజీవసమాధి అయితే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకుపోతే పట్టించుకున్న పరిస్థితి లేదు. కేసీఆర్‌ను బదనామ్ చేసేందుకే మేడిగడ్డను పక్కన పెట్టారు. రెండున్నరేళ్లుగా మరమ్మతు చేయక రైతుల పొట్టకొట్టిండ్రు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బరాజ్‌కు మరమ్మతు చేయాలి.
– తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే, స్టేషన్‌ఘన్‌పూర్
మహదేవపూర్ : రైతులకు సాగు నీరందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే పేరుగాంచింది. కాళేశ్వరంతోనే రాష్ట్రం సస్యశ్యామలమైంది. బరాజ్‌లో ఏర్పడిన చిన్న కుంగుబాటును సాకుగా చూపి కాంగ్రెస్ రెండున్నరేళ్లు రైతులకు సాగు నీరివ్వక ముప్పతిప్పలు పెడుతున్నది. ఆనాడు కేసీఆర్ హయాంలో ఇష్టంగా వ్యవసాయం చేసిన రైతులు నేడు సాగు నీరు లేక తంటాలు పడుతున్నారు. పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టంచుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అరాచక పాలనను గమనిస్తున్నరు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి