పర్వతగిరి: యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు. శనివారం ఉదయం పర్వతగిరి మండలం ఏపీ తండా శివారులోని ఉట్టి తండాకు చేరుకున్న ఎర్రబెల్లి.. పత్తి పంటను పీకేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. రైతు బాలు నాయక్ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే రైతాంగానికి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
అసలేం జరిగిందంటే..
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం. యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై భూక్యా బాలునాయక్ కుటుంబంతో కలిసి వినూత్న నిరసన తెలిపాడు. యూరియా దొరకక విసుగుచెందిన బాలునాయక్ ఏడెకరాలలోని పత్తి చేనును పీకేశాడు. కాంగ్రెస్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. యూరియా దొరక్క పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థంగాక కడుపుమండి పత్తి చేనును పీకేసినట్టు రైతు బాలు కన్నీటి పర్యంతమయ్యాడు. గతంలో సీఎం కేసీఆర్ సారు రైతాంగానికి అన్ని విధాలుగా అండగా నిలిచారని గుర్తుచేశారు. నేడు సీఎం రేవంత్రెడ్డి రైతుల కంట కన్నీటికి కారణమయ్యాడని, దగా చేశాడని మండిపడ్డారు. బాలునాయక్ కుటుంబం నిరసన విషయం తెలిసిన బీఆర్ఎస్ నాయకులు వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.