పాలకుర్తి రూరల్/రాయపర్తి/పెద్దవంగర/వర్ధన్నపేట, అక్టోబర్ 1 : రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కొట్లాడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. ఈ నెల 4న నియోజక వర్గంలోని తొర్రూరులో బీఆర్ఎస్ నేతృత్వంలో నిర్వహిస్తున్న రైతుల ఆందోళన, పార్టీ శ్రేణుల రాస్తారోకో కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎర్రబెల్లి కోరారు.
మంగళవారం పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పెద్దవంగర మండల కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో, పాలకుర్తిలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా ఆయన పాల్గొన్నారు. అలాగే వర్ధన్నపేట మండలం ఇల్లందలో పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలో దోపిడీదారుల పాలన కొనసాగుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రు లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆర్థిక వనరుల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి వర్గంలో కూడా అసమ్మతి రాజుకుంటున్నదని, ప్రభుత్వం ఉంటుందో, పోతుందో అనే భయంతోనే ఆయన పాలన చేస్తున్నాడన్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ల సారథ్యంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఎదురుదాడిని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో చేపట్టిన మూసీ నది ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలతో వలస కుటుంబాలు, రోజువారీ కూలీలు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు నిత్యం ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించనట్లు రూ.2 లక్షల రుణమాఫీ 50శాతం కూడా ఎక్కడా జరగలేదన్నారు. యాసంగి సీజన్ వచ్చినా రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు అందలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పెట్టుబడికి గోసపడకుండా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేశారని గుర్తుచేశారు. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే రైతు రుణమాఫీపై ధర్నాకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.
సమావేశాల్లో ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మునావత్ నర్సింహనాయక్, ఐలయ్య, తీగల దయాకర్, తూళ్ల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సంజయ్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, మాజీ దేవస్థాన చైర్మన్ రామచంద్రశర్మ, నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, నల్లా నాగిరెడ్డి, బస్వ మల్లేశం, పేరం రాము, పసునూరి నవీన్, మాచర్ల ఎల్లయ్య, చింత రవి, బొబ్బల ఆశోక్‌రెడ్డి, గాంధీ నాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, ఎండీ నయీం, పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, అయిత రాంచందర్, పారుపల్లి సుధాకర్‌రెడ్డి, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, బెల్లి పెద్దాపురం, గజవెల్లి ప్రసాధ్, చిన్నాల ఉప్పలయ్య, బొడ్డు రంగయ్య, కుందూరు యాదగిరిరెడ్డి, భూక్యా క్రాంతి, సుధీర్ కుమార్, జ్ఞానేశ్వరాచారి, వెంకట్రామయ్య, భాస్కర్‌రావు, పటేల్నాయక్, రాము, సమ్మయ్య, రఘు, షర్ఫుద్దీన్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, అనుదీప్, వర్ధన్నపేట మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, గుజ్జ సంపత్‌రెడ్డి, గుజ్జ గోపాల్‌రావు, చందర్రావు తదితరులు పాల్గొన్నారు.