పర్వతగిరి, మార్చి 3 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగు నీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా, సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ల ముందే ఎండిపోవడాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వెంటనే స్పందించిన ఆయన రావూరు గ్రామానికి చేరుకొని ఆకేరు వాగులోని చెక్‌డ్యామ్, ఎండిపోతున్న వరి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకొని వారిని ఓదార్చారు. అక్కడి నుంచే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి కూడా ఫోన్ చేసి పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో రైతులున్నారని, వారికి నీరందించేలా సహకరించాలని కోరారు. అలాగే నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌తో సైతం ఫోన్లో మాట్లాడి రైతులకు సాగు నీళ్లు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రైతులతో ఎర్రబెల్లి మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో గతంలో ఎండాకాలం కూడా చెరువులు మత్త్తడి పడేవని, కాంగ్రెస్ రాగానే కష్టాలు మొదలయ్యాయన్నారు. ఆకేరు వాగు చెక్ డ్యామ్ ఎప్పుడూ నీటితో కళకళలాడేదని, దీనిపై ఆధారపడి కొత్తపల్లి, ల్యాబర్తి, బంధనపల్లి, కొత్తూరు, రోళకల్లు, రావూరు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, సోమారం, జమస్థాన్పురం, మడిపల్లి, గుర్తూరు రైతులు వేయి ఎకరాలకు పైగా పంటలు సాగుచేసేవారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతుల కోసం నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పంట పరిశీలించేందుకు వచ్చిన ఎర్రబెల్లిని చూసి ఓ రైతు ఎదురుగా వచ్చి ఆయన కాళ్లకు దండం పెడుతుండగా ఆయన దగ్గరకు తీసుకొని ఓదార్చారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, మాజీ జడ్పీటీసీ పంతులు, మాజీ సర్పంచులు మాలతీ సోమేశ్వర్రావు, బండి సంతోష్, ఆమడగాని రాజు, విజయ్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, నాయకులు లక్ష్మీనారాయణ, గడ్డి యాకయ్య, శ్యామ్‌గౌడ్, చింతల శ్రీనివాస్, ఆమ్లానాయక్, నరేష్, రైతులు ఉన్నారు.