ఖిలావరంగల్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం టాస్క్‌ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్‌పై దృష్టి సారించాలన్నారు. ఇటుక బట్టీలు, బీడీల తయారీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలు తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. హార్వెస్టింగ్ పనుల్లో తనిఖీ నిర్వహించాలని సూచించారు. బాల కార్మికుల చట్టం కింద బాల కార్మికులను నియమించిన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో చైల్డ్ లేబర్ విజిలెన్స్ గ్రూపును ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఈ నెల 21 నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాశిబుగ్గలోని స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీవో కౌసల్యాదేవి, డీఈవో జ్ఞానేశ్వర్, డీవైఎస్వో సత్యవాణి, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, ఫీల్డ్పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.