హనుమకొండ, జూలై 29 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. వెంటనే 20 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్ విడుదల చేయాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 19 వేల వరకు ఖాళీలున్నాయని డీజీపీ వెల్లడించినప్పటికీ ప్రభుత్వం కేవలం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దురదృష్టకరమన్నారు. కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఒక పోస్టు కూడా దకని పరిస్థితి ఉందన్నారు.
రెండేళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళనలో ఉన్న అభ్యర్థులందరూ దీనిపైనే ఆశలు పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో మూడు భారీ నోటిఫికేషన్ల ద్వారా వేలాది పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ను తక్షణమే నిలిపివేయాలని, మరో 13 వేల పోస్టులు జోడించి మొత్తం 20 వేలతో ఆగస్టు 15లోపు కొత్తది విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని రాకేశ్రెడ్డి హెచ్చరించారు.