ముంబై, అక్టోబర్ 3: ఒకవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్నప్పటికీ..మరోవైపు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే సంస్థలు మాత్రం వెనుకంజ వేయడం లేదు. చిన్నాచితక సంస్థల నుంచి కార్పొరేట్ల వరకు నిధుల సేకరణే అజెండాగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా 69 సంస్థలు రూ.90 వేల కోట్లకు పైగా నిధులను సేకరించాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.25 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించినట్టు అయింది. విస్తృత మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ..ప్రైమరీ మార్కెట్ మాత్రం దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టీ 14 శాతం, సెన్సెక్స్ 15 శాతం చొప్పున పతనం చెందాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీన పనితీరు కనబరిచిన ప్రధాన ఈక్విటీ మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. గత మూడు నెలల్లో ఐపీవోకి వచ్చిన సంస్థల్లో ఎన్ఎస్ఈ అత్యధికంగా రూ.22 వేల కోట్లకు పైగా నిధులను సేకరించగా..ఎస్బీఐ ఫండ్స్ రూ.9,795 కోట్లు, మణిపాల్ హెల్త్ రూ.9,275 కోట్లు సేకరించాయి. ఈ మూడు సంస్థలే సగం నిధులను సమీకరించడం విశేషం.
చిన్నాచితక సంస్థలు తమ బ్రాండ్‌కు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రైమరీ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ప్రధానంగా ఎంఎస్ఎంఈలు వీటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. తమ వ్యాపార విస్తరణకు, ఇతర అవసరాల నిమిత్తం సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ అధినేత అజిత్ మిశ్రా మాట్లాడుతూ..గత నెలలో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు గణనీయంగా వేగవంతమయ్యాయి..ఇది బలమైన దేశీయ ద్రవ్యత, సంస్థాగత డిమాండ్, మెరుగైన మార్కెట్‌ను ప్రతిబింబించే విధంగా ఉన్నాయన్నారు.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి మరో 130 కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వీటికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదముద్ర వేసింది. ఆయా సంస్థలు మొత్తంగా రూ.3.96 లక్షల కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో 84 సంస్థలు రూ.1.10 లక్షల కోట్ల వరకు నిధులను సేకరించాయి. అలాగే 2016 నుంచి 2026 ఏడాది ఇప్పటి వరకు రూ.8.36 లక్షల కోట్ల వరకు నిధులను సేకరించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ విభాగం జియో ఫ్లాట్‌ఫామ్..మెగా ఐపీవోకి సిద్ధమవుతున్నది. 3.8 బిలియన్ డాలర్లు లేదా రూ.37 వేల కోట్లకు పైగా నిధుల సమీకరణ లక్ష్యంగా..ఈ నెల చివర్లో ఐపీవోకి రాబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై..ఈ నెల 23న ముగియనున్నట్టు కంపెనీ అనుబంధ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. యాంకర్ ఇన్వెస్టర్ల బుకింగ్ 19న జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. పబ్లిక్ ఇష్యూలో 27 కోట్ల తాజా షేర్లను కంపెనీ జారీ చేయనున్నట్టు ఇదివరకే సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్‌లో పేర్కొన్నది.
