తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తుంటారు. కొందరు కొడుకును ఇష్టపడితే, మరికొందరికి కూతురంటే ప్రాణం. పిల్లల్లో కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆనందంలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అంశంపై చైనాలో ఓ పరిశోధన చేశారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు పెంపకం కన్నా.. కూతురి ఆలనాపాలనా చూడటంలోనే చాలామంది తల్లిదండ్రులు ఎక్కువ ఆనందం పొందుతున్నారని తేలింది. పిల్లల సంఖ్య, వారి లింగం, తల్లిదండ్రుల సంతోషం, కుటుంబ సంబంధాలను ఈ పరిశోధనలో పరిశీలించారు. ఈ ప్రభావం అందరిలోనూ ఒకేలా కనిపించలేదు.
ముఖ్యంగా మధ్య వయసులైన తల్లిదండ్రులు, పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని బట్టి వ్యత్యాసాలను గుర్తించారట పరిశోధకులు. మనుషుల ఆనందాన్ని ఆదాయం, ఆరోగ్యం, వైవాహిక జీవితం, నివసించే ప్రాంతం, కుటుంబ బంధాలు ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. కాగా భారతీయ సమాజంలో లేదా ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థలు, బాధ్యతలు, సాంసృతిక అలవాట్లు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలు అన్ని దేశాలకూ యథాతథంగా వర్తించకపోవచ్చు. చాలా అధ్యయనాలు, మానసిక నిపుణుల ప్రకారం ఆడపిల్లలు వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులతో ఎకువ భావోద్వేగ అనుబంధాన్ని కొనసాగిస్తారు.
తల్లిదండ్రుల ఆరోగ్యం, మానసిక స్థితిని అర్థం చేసుకుని మద్దతుగా నిలవడంలో అమ్మాయిలు చొరవ చూపుతారని పరిశోధన సారాంశం. ఒకప్పుడు మన దేశంలో కొడుకు పుడితేనే సంరక్షణ ఉంటుందనే సంప్రదాయ భావన ఎకువగా ఉండేది. కానీ, ప్రస్తుతం విద్యావంతులైన కుటుంబాల్లో అమ్మాయిలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొకుకుంటూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. కారణాలేవైనా.. కొడుకు కన్నా, కూతురు పెంపకంలోనే తల్లిదండ్రులు ఎక్కువ సంతృప్తికరంగా ఉంటున్నారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అందుకే కాబోలు.. ‘కంటే కూతుర్నే కనాలిరా’ అన్నారో సినీకవి.