ఏటూరునాగారం, డిసెంబర్ 30: ‘గిరిజనుల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాలి.. గిరిజన సీఆర్టీల సమస్యలు పట్టవా?, వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎనిమిది రోజులుగా ఐటీడీఏ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న సీఆర్టీల శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీలుగా పనిచేస్తున్న కాంట్రా క్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విడుతల వారీగా వారి వేతనాలు పెంచి ఆదుకున్నదన్నారు. మినిమం టైం స్కేలు ఇవ్వాలని, ప్రతి నెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళా సీఆర్టీలకు ప్రసూతి సెలవులు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. సమస్యలు పట్టించుకోకుంటే సీఆర్టీల కుటుంబాలు కూడా సమ్మెలో పాల్గొనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు జంపన్న, గడదాసు సునీల్ కుమార్, ఖాజాపా షా, కుమ్మరి చంద్రబాబు, కావిరి చిన్ని కృష్ణ, మందపల్లి సాగర్, పెంచికల లక్ష్మీనారాయణ, గార ఆనంద్, మాదారి రాంబాబు, ఎంపెల్లి రాజు, అనంత్, తదితరులు పాల్గొన్నారు.
సీఆర్టీలు వారం రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఐటీడీఏ, ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడంతో సోమవారం మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఆర్టీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర్, ఉపాధ్యక్షుడు పొడెం రవీందర్, జిల్లా అధ్యక్షుడు కొండా రామయ్య, కార్యదర్శి ధరంసోత్ రాజు, తిరుపతి, హరిలాల్, రాములు, మల్లయ్య, చందు, కిషన్, ప్రతాప్, శ్రీనివాస్, సంపత్, సుధాకర్, సరళ, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.