ఈసారి కాలం కలిసిరాకపోయినా సాగునీటి కష్టాలను అధిగమించి వరి పండించిన రైతు.. ఆ పంటను అమ్ముకునేందుకూ పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అకాల వర్షాలతో ఇప్పటికే ఆగమైన అన్నదాతకు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాల్లో బార్దన్లు లేక, కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతేగాక తేమ శాతం పేరుతో కొర్రీలు, కోతలు పెట్టడం, కొన్న తర్వాత వడ్లను తరలించే విషయంలోనూ అటు నిర్వాహకులు, మిల్లర్లు, అధికారుల అంతులేని నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. ఇలా అన్నీ కలిసి రైతులపై ఆర్థికంగా మోయలేని భారం పడి చివరకు నష్టం కలిగిస్తున్నది.
– వరంగల్, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. అకాల వానలతో వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు, అక్కడ కాంటాలు పెట్టించేందుకు రైతులపై ఆర్థికంగా అధికంగా భారం పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. అవసరమైనన్ని బార్దన్లు(సంచులు) లేకపోవడంతో వడ్ల కాంటాలు కావడం లేదు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లో పోసి 15 రోజులు గడస్తున్నా కాంటాలు వేయడం లేదు.
కేంద్రాలకు వచ్చే వడ్లు, వాటికి అవసరమైన బస్తాలు ఎన్ని అనేది అంచనా వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాంటా కోసం ఎక్కువ రోజులు వేచిచూడాల్సి రావడంతో ఇదే అదునుగా నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతుకు నష్టం చేస్తున్నారు. కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించే విషయంలోనూ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్ల పరిమాణానికి తగినట్లుగా లారీలను సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కారణాలు ఏమైనా వడ్ల కొనుగోలు కోసం సర్కారు కేంద్రాలకు వెళ్లిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల పేరుతో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. వడ్ల బస్తాలతో 41 కిలోల చొప్పున తూకం వేయాలి. కానీ తేమ పేరుతో ఎక్కువ తీసుకొని రికార్డులో తక్కువ రాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై ఒక్కో బస్తాలో 42 కిలోల 200 గ్రాముల చొప్పున తూకం పెడుతున్నారు. హమాలీలు, నిర్వాహకులకు ఎంతోకొంత ముట్టజెబితేనే కాంటాలు పెడుతున్నారు.
పరిశీలన పేరుతో అధికారులు ఎన్నిసార్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చినా అక్కడ రైతుకు జరిగే నష్టాన్ని ఎవరూ అరికట్టడం లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో యాసంగి వరి సాగుకు పెట్టుబడి ఎక్కువ కాగా దిగుబడి మాత్రం తగ్గింది. పండిన కొద్ది పంటనైనా అమ్ముకుందామంటే నిబంధనల పేరుతో రైతులకు నష్టం చేస్తున్నారు.
ఖర్చుల భారం తడిసి మోపెడు..
రైతులు పంటలు పండించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తున్నది. యాసంగిలో వరి పంటను కోసుకునే సమయంలోనే రెండు మూడు రోజలు క్రితం కురిసిన వానలకు పొలాలు, వడ్లు తడిసిపోయాయి. రైతులు వడ్లను పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయేందుకు అరిగోస పడుతున్నారు. కూలీల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి.
పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు టైర్ల యంత్రాలకు బదులుగా చైన్ మిషన్లతో వరి కోతలు చేయించాల్సి వస్తున్నది. టైర్ల మిషన్‌కు గంటకు రూ.2 వేలు అయితే చైన్ మిషన్కి గంటకు రూ.3,500 చెల్లించాల్సి వస్తున్నది. ప్రతికూల వాతావరణంతో ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు చేతికొచ్చిన పంటను ఇంటికి తెచ్చుకునేందుకు కోతల యంత్రాలకు చెల్లించే చార్జీలతో పెట్టుబడి ఖర్చు ఇంకా పెరుగుతున్నది.
తేమ పేరుతో కొర్రీలు
వడ్లను పూర్తిగా ఆరబెట్టి తీసుకొస్తేనే తూకం వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. నిర్వాహకులు దీనిని ఆసరా చేసుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తేమ శాతం 14 ఉన్నా సాకులు చెప్పి కాంట వేయడం లేదు. వడ్లను తర లించేందుకు అవసరమైన బస్తా సంచులు రాకపోవడంతో నిర్వాహకులు తేమ పేరు చెప్పి కాంటాలను వాయిదా వేస్తున్నారు. వడ్లను పూర్తిగా ఆరబెట్టేందుకు రోడ్లపైన, బహిరంగ స్థలాల్లో పోస్తున్నారు. వాతావరణ మార్పులతో ఎప్పుడు పడితే అప్పుడు వానలు వస్తున్నాయి. పొద్దంతా ఎండిన వడ్లు సాయంత్రం తడిసిపోతున్నాయి. వడ్లను ప్రతిరోజు పొద్దున ఆరబోయడం, సాయంత్రం దగ్గరగా పోయడంతో కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతున్నది. రైతులు ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.300 చెల్లించి కూలీలతో తూర్పార పట్టిస్తున్నారు. వడ్లను ఆరబెట్టేందుకు 10 ట్రాక్టర్ల వడ్లు ఉన్న రైతు రోజుకు రూ.3 వేలు చెల్లించాల్సి వస్తున్నది.
పలుకుబడి ఉన్నోళ్లవే ముందు కాంటా పెడుతారా?
దంతాలపల్లి, మే 10 : ధాన్యం కాంటాల విషయంలో నిర్వాహకులు క్రమపద్ధతి పాటించడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని తూర్పుతండాలో ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టకుండా పలుకుబడి ఉన్న వారివి, డబ్బులు ఇచ్చిన వారివే ముందు కాంటాలు పెట్టి తరలిస్తున్నారని శనివారం నిరసన తెలిపారు. బస్తాలను మిల్లులకు తరలించకుండా ప్రైవేట్ దళారులకు ఇష్టానుసారం ఇస్తూ కేంద్రంలో ఉన్న రైతులకు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు నిర్వాహకుడితో మాట్లాడి రైతులను నచ్చజెప్పడంతో శాంతించారు.
మాకు చెప్పకుండా తరలిస్తే ఎలా?
తొర్రూరు, మే 10 : తొర్రూరు మండలంలోని హరిపిరాల ఐకేపీ సెంటర్ బస్తాల తరలింపుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బార్దన్లు లేక కాంటాలు ఎకడికకడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు బార్దన్లు లేక ఇబ్బందులు పడుతుంటే వచ్చే సంచులను చీకటాయపాలేనికి ఎలా పంపుతారంటూ అధికారులను రైతులు నిలదీశారు. తమ చెప్పకుండా తరలించడం అన్యాయమని తమ గ్రామానికి రావాల్సిన సంచులు ఇతర గ్రామానికి ఎలా వెళ్తాయని ప్రశ్నించిన రైతులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన అధికారులు సెంటర్ ఇన్చార్జి ధనుంజయని తొలగించారు.