వరంగల్ చౌరస్తా, ఆగస్టు 30 : అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యులు.. ఎంజీఎంలోని పీడియాట్రిక్ వార్డుకు తరలించాలని నిర్ణయించి వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి ఆ నవజాత శిశువుకు కృత్రిమ శ్వాస అందించి ఊపిరి పోసేందుకు శ్రమించిన తీరుకు అందరూ సలాం కొట్టారు.
వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్‌కు చెందిన సద్దాం హుస్సేన్ భార్య రమీషాబేగం మొదటి కాన్పులో బాబుకు జన్మినిచ్చింది. అయితే శ్వాస తీసుకోవడంలో లోపా న్ని గుర్తించిన వైద్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారమిచ్చారు.
హుటాహుటిన సిబ్బంది అక్కడకు చేరుకొని బాబుకు అంబూ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ పీడియాట్రిక్ వార్డు కు తరలించారు. ఈ క్రమంలో బాబుకు ఊపిరి అందించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ స్వాతి, పైలట్ సదానందం చూపిన చొరవ, తాపత్రయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు. ప్రస్తుతం శిశువు ఆరో గ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.