హనుమకొండ చౌరస్తా/ ఖిలావరంగల్/ జనగామ చౌరస్తా/ భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 1: కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినదించారు. సోమవారం పెన్షన్ విద్రోహదినంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఆయా కలెక్టరేట్ల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఇందులో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.
ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో లక్షలాది మంది ఉద్యోగుల భద్రతను, కుటుంబాల సంక్షేమాన్ని సీపీఎస్ బలి తీసుకుంటున్నదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ విధానాన్ని రద్దు చేయాలని 20 ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టినవిధంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు, జేఏసీ నేత అన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగుల హకు అని, రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ పక్షాన పెండెం రాజు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం తమ సమస్యలు పరిషరిస్తుందని వేచి చూశామని, ఇకముందు అలా జరగదని, సమస్యలు పరిషారమయ్యేవరకు పోరాటం చేస్తామన్నారు.
కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల జేఏసీ నేతలు బైరి సోమయ్య, గణిపాక రాజ్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, గాజే వేణుగోపాల్, ఫణికుమార్, పుల్లూరు వేణుగోపాల్, జయశంకర్ భూపాలపల్లిలో టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవి, టీజీఈజేఏసీ కన్వీనర్, టీజీవోఅధ్యక్షురాలు ఎల్ విజయలక్ష్మి, సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు దిల్షాద్, టీజీఈజేఏసీ కో చైర్మన్ ఏ తిరుపతి, యూటీఎఫ్ నాయకుడు నక తిరుపతి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఏ దశరథరామారావు, జనగామలో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఎండీ ఖాజా షరీఫ్, టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్ ఎన్ కోర్నేలియస్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షరీఫ్, టీజీసీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.