లింగాలఘనపురం, అక్టోబర్ 3 : అతడు ఆ ఊరిలోని వారందరికీ సుపరిచితుడు. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరు పిలిచినా పలికేవాడు.. రాత్రనక, పగలనక ఎక్కడ కరెంట్ సమస్య ఉందన్నా వెళ్లి సరిచేసేవాడు. అతడిని విధి వంచించింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ ప్రమాదం చోటుచేసుకోగా మంచానికే పరిమితం చేసింది. మూడేళ్ల క్రితం పరిహారం కోసం కోర్టులో వేసిన కేసు ఎటూ తేలకముందే అతడి జీవితాన్ని ముగించింది. తమ ఆత్మీయుడు కట్టర్ రమేశ్ ఇక లేడన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ (29) ఐటీఐ పూర్తిచేసి విద్యుత్ సంస్థలో కాంట్రాక్టర్ దగ్గర కట్టర్ (అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్)గా రూ. 8 వేల వేతనంపై పనిచేస్తుండేవాడు. గ్రామంలోని గృహ వినియోగదారులు, వ్యాపారస్తులకు విద్యుత్ సమస్య తలెత్తితే పిలిచిందే తడవుగా వెళ్లి సరిచేస్తుండేవాడు. ఈ క్రమంలో 2020 జూన్ 6న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడ్డ సమస్యను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన రమేశ్ శరీరమంతా కాలిపోయి మంచానికే పరిమితమయ్యాడు.
ఏడాదిన్నర కాపురం చేసిన అతడి భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. కాంట్రాక్టర్ మాత్రం కొంత మానవత్వాన్ని ప్రదర్శించాడు. ఏడాదిపాటు జీతం చెల్లించాడు. ఈ క్రమంలో లింగాలఘనపురానికి ఏ విద్యుత్ ఉన్నతాధికారి వచ్చినా కుటుంబ సభ్యులు రమేశ్‌ను మంచంపై మోసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకునే వారు. కొన్ని సందర్భాల్లో లింగాలఘనపురం సబ్‌స్టేషన్, అధికారుల ఎదుట ధర్నా చేశారు. మూడేళ్ల క్రితం నష్టపరిహారం కోరుతూ హైదరాబాద్‌లోని లేబర్ కోర్టులో కేసు వేయగా అది కొనసాగుతున్నది. ఆ కేసు ఎటూ తేలకముందే గురువారం విధి వక్రించి రమేశ్ కనుమూశాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.