హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24 : సాంకేతిక సమస్యలతో ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో 112 సర్వీసులు జనవరి నుంచి ప్రారంభం కాగా, తరచూ బ్రేక్ డౌన్లకు గురవుతున్నాయి. ఇందులో మూడు స్వల్ప ప్రమాదాలు కాగా, మిగతా వన్నీ టెక్నికల్ ప్రాబ్లంతో రోడ్లపైనే నిలిచి పోయాయి. జేబీఎం కంపెనీ సరిపడా సిబ్బందిని నియమించక మరమ్మతుల్లో ఆలస్యం జరుగుతుండగా, ఎక్కడ బస్సులు నిలిచిపోతాయోననే భయాందోళనలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో అందు బాటులోకి తెచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియన్‌కు 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, సూపర్‌లగ్జరీ-18, డీలక్స్-22, ఎక్స్‌ప్రెస్‌లు-72 ఉన్నాయి. వీటిని హనుమకొండ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, సూర్యాపేట రూట్లలో నడుపుతున్నారు. ప్రతి దానికి సెన్సార్లు ఉంటాయి. సాంకే తికతపై డ్రైవర్లకు అనుభవం లేకపోవడంతో చిన్న సమస్య వచ్చినా బస్సు కదలడం లేదు. ఈవీలు మొరాయించిన సందర్భంలో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఇతర బస్సుల్లో చేరవేస్తున్నా ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. కూర్చునేందుకు సీట్లు లేక నిలబడాల్సి రావడంతో అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.
సాంకేతిక లోపంతో నిత్యం ఈ-బస్సులు మరమ్మతులు గురవుతున్నా జేబీఎం కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఈ-బస్సుల సరఫరా, నిర్వహణ జేబీఎం ఆటో లిమిటెడ్ అనుబంధ సంస్థ జేబీఎం ఎకోలైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ బస్సులను వరంగల్-2 డిపో ద్వారా నడుపుతున్నారు. ఈ మేర కు డిపో ఆవరణలో ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మా ణంతో పాటు చార్జింగ్ స్టేషన్లు నిర్మించారు. బస్సులు నడిపేందుకు, మొరాయిస్తున్నా మరమ్మతులు చేసేందుకు సరిపడా సిబ్బందిని నియమించడం లేదని ఆర్టీసీ అధికారులు మండిపడుతున్నారు. ఈ బస్సుల మరమ్మతులపై అనుభవం లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తోంది. కంపెనీ నుంచి మెకానిక్ వచ్చి బాగుచేసి తిరిగి నడపడానికి రెండు రోజుల సమయం పడుతున్నది. ప్రతి రోజూ 5 బస్సులు బ్రేక్ డౌన్లు అవుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వరంగల్ రీజియన్ పరిధిలో ప్రతి రోజూ 5,6 బస్సులు సాంకేతిక కారణాలతో రోడ్డుపై నిలిచిపోతున్నాయి. మ్యాన్‌పవర్ కూడా లేదు. ఎలక్ట్రిక్ బస్సులు నడపడంలో డ్రైవర్లకు అనుభవరాహిత్యం, సాంకే తిక సమస్యలతో మొరాయిస్తున్నాయి. జేబీఎం కంపెనీ పట్టించుకోవడంలేదు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడానికి వారు ఆలోచిస్తున్నారు.
– డీ విజయభాను, రీజినల్ మేనేజర్, వరంగల్