నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 17 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంతో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు జిల్లాల్లో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో 53,918 ఓటర్లకు 45, 228 మంది (83.88), వరంగల్‌లో 1,24,555కు 1,09,870 (88.21), హనుమకొండలో 1,11,341 కు 96,264 (86.45), భూపాలపల్లిలో 98,052కు 82382 (84.02), జనగామలో 1,17,381కు 1,03,860 (88.48), మహబూబాబాద్‌లో 1,60,587 కు 1,42,153(88.52) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు జిల్లాల్లో తుది విడత 34 సర్పంచ్, 765 వార్డుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 530 సర్పంచ్, 4,130 వార్డు స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు భారీగా చేరుకొని ఓటేయడంతో పోలింగ్ శాతం పెరిగింది.
ఉదయం 7 నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఆయా జిల్లాల్లో పోలింగ్ సరళిని కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, ఎన్నికల అధికారులు పరిశీలించారు. కాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తన సొంత గ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు (విలేజి) శివారు పెద్ద తండా గ్రామంలో, హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఓటు హకును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్ఎస్
మూడో విడత సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్ పోటీనిచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 530 జీపీల్లో 164 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకొని సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ 322, బీజేపీ 6, ఇతరులు 38 స్థానాల్లో గెలుపొందారు.
ఒకటి, రెండు ఓట్ల తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు
నర్సంపేట/నెక్కొండ : నర్సంపేట మండలంలో ఓ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. గుర్రాలగండిరాజపల్లిలో (జీజీఆర్‌పల్లి) బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కత్తుల కుమారస్వామికి 190 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నర్సయ్యకు 191 ఓట్లు రావడంతో గెలుపొందాడు. అదేవిధంగా నెక్కొండ మండలం అమీన్‌పేటలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డెక్క చంద్రయ్యకు 255 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన డెక్క ఎల్లయ్యకు 256 ఓట్లు రావడంతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
సీతారాంపురంలో బీఆర్ఎస్ బలపరిచిన కట్కూరి విజయలక్ష్మికి 191 ఓట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కట్కూరి శేషారెడ్డికి 190 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. రెడ్యానాయక్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అంగోత్ ఉమకు 105 ఓట్లు రాగా, అంగోత్ దేవికి 103 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో ఉమ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. మడిపెల్లి జీపీలో కాంగ్రెస్ బలపరిచిన అంగోత్ అనూషకు 294 ఓట్లు రాగా, బీఆర్ఎస్ బలపరిచిన తేజావత్ కవితకు 291 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్ల తేడాతో అనూష గెలిచింది.
