ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూర్చున్న వీరంతా ఆసరా పింఛన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన వీరు రెండు రోజులుగా ఇలాగే అగచాట్లు పడుతున్నారు. ఇక్కడ 1,230 మంది లబ్ధిదారులుండగా, ఇందులో 210 మంది దివ్యాంగులు, 150 మంది మంచానికే పరిమితమైన వారున్నారు.
గతంలో ఇక్కడ పింఛన్లు ఇచ్చే వ్యక్తి పలుచోట్ల కూర్చొని పంపిణీ చేయడంతో పాటు నడవలేని, మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి అందజేసేవాడు. అయితే ఈ నెల నుంచి చిల్పూరు మండలం చిన్న పెండ్యాలకు చెందిన బీపీఎంకు బాధ్యతలు అప్పగించడంతో అతడు గ్రామ పంచాయతీలోనే పంపిణీ చేస్తున్నాడు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు జీపీకి చేరుకొని సాయంత్రం వరకు ఇబ్బందులు పడుతూ పింఛన్ తీసుంటున్నారు. అధికారులు స్పందించి గతంలో లాగానే ఒకేచోట కాకుండా పలుచోట్ల పంపిణీ చేయడంతో పాటు మంచానికే పరిమితమైన, నడవలేని వారి ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు. – స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 23