ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస్లిం ప్రవక్తలు, మత పెద్దలు రంజాన్ పర్వదినాన్ని ప్రకటించారు. మనసుని దైవచింతనకు ప్రేరేపించే సందర్భం.. రోజా ఉపవాస దీక్షలు, ఆత్మీయతను అలింగనం చేసుకునే సత్సంప్రదాయమే రంజాన్‌గా చెప్పుకోవచ్చు. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రెండు పండుగలలో మొదటిది రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్). ఇప్పటికే మసీదులు, ప్రార్థనలు(నమాజ్) చేసే ఈద్గా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల విద్యుత్ దీపాలతో మసీదులను శోభాయమానంగా అలంకరించారు.
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 21 : అత్యంత నిష్ఠతో నెలరోజుల కఠోర ఉపవాస దీక్ష పూర్తిచేసుకున్న ప్రతి ముస్లిం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పవిత్రమైన రంజాన్ పర్వదినం వచ్చేసింది. ఆకాశంలో శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం ఇంటిల్లిపాది పండుగను సంతోషంగా జరుపుకొనేందుకు ప్రతి కుటుంబం సిద్ధమైంది. ఈమేరకు సామూహిక ప్రార్థనలు చేసేందుకు ఈద్గా మైదానాలు, మసీదులను ముస్తాబు చేసి అందంగా అలకరించారు. ఇక ఆత్మీయ ఆలింగనాలు, అత్తరు గుబాళింపుల నడుమ ఖేర్, సేమియాల తియ్యదనం.. హలీం ఘాటుదనం.. బిర్యానీ పలావుల ఘుమఘుమలను ఆస్వాదించి దానధర్మాలు చేయనున్నారు.
ఈద్-ఉల్- ఫితర్..
30రోజుల పాటు నిర్వహించిన ఉపవాస దీక్షలు ఉపసంహరణే ఈద్-ఉల్-ఫితర్. అల్లా పెట్టిన కఠోర పరీక్షలను ఎదుర్కొని నియమాలను ఆచరిస్తూ నిండైన ఆత్మవిశ్వాసంతో అరవిరిసిన ఆనందంతో జరుపుకునేదే ఈద్-ఉల్-ఫితర్ పర్వదినంగా పెద్దలు చెబుతున్నారు. పండుగ నాడు ఎంత పేద వారైనా కొత్త దుస్తులు ధరించి అత్తరు, సుర్మాలు పులముకొని ఈద్గాలలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ మత పెద్దలు వినిపించే ‘కుద్భా’ ను భక్తిశ్రద్ధలతో విని భావి జీవితం సుఖసంతోషాలతో గడిచేలా చూడాలని దేవుడు(అల్లా)ను వేడుకొని ప్రార్థన (నమాజ్) చేస్తారు. నమాజ్ అనంతరం ఈద్ ముబారక్ అంటూ ఆత్మీయతతో ఆలింగనాలు చేసుకుంటారు. ఈ సందర్భాల్లోనే మాటలు మానుకున్న మిత్రులు సైతం ఒక్క ఆలింగనంతోనే దగ్గరైపోతారు. అనంతరం పేదలకు వస్తువులు, బట్టలు, పైసల రూపంలో దాన ధర్మాలు చేస్తారు. కుల, మత బేధం లేకుండా స్నేహితులను తమ ఇళ్లలోకి ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి, బిర్యానీ ఘుమఘుమల రుచిని చూపిస్తారు.
జకాత్..
జకాతంటే దానధర్మాలు చేయడం. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి తన వార్షిక ఆదాయంలో 2.5శాతం దీనులకు, పేదలకు, ఆపదలో ఉన్న వాళ్లకు ఖర్చు చేయాలి. ఈ జకాత్‌ను గనుక రంజాన్ మాసంలో చేసినట్లయితే 70శాతం అధిక పుణ్యం లభిస్తుందన్నది ముస్లింల నమ్మకం. ఒకప్పుడు జకాత్ అనేది ఆహారం, దుస్తుల రూపంలో ఉన్నా ఇప్పుడు నగదును కూడా జకాత్ రూపంలో ఇస్తూ పేద వాళ్లను ఆదుకుంటున్నారు. జకాత్ ఇవ్వడానికి ధనవంతులే కానవసరం లేదు. చిల్లిగవ్వ చేతిలో లేకున్నా సాటి మనిషి చిరునవ్వులతో పలకరించినా జకాతే అవుతుంది.