నమస్తే తెలంగాణ నెట్వర్క్: రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు. పొద్దన లేచింది మొదలు ఎరువు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం.. తిండీ తిప్పలు మాని కుటుంబాలతో సహా సొసైటీల ఎదుట పడిగాపులుగాయడం నిత్యకృత్యంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద పలు గ్రామాల రైతులు శనివారం యూరియా బస్తాల కోసం రాగా, నిర్వాహకులు స్పందించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఏఈవో రాజన్న యూరియా బస్తాల కోసం లైన్ కట్టిన రైతులకు డెలివరీ ఆర్డర్ తెప్పించి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది.
పంటలకు అదనుకు యూరియా వేయాలనే తాపత్రయంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలకేంద్రంలోని రైతు వేదిక వద్దకు పలు గ్రామా ల రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే చేరుకొని క్యూలైన్లో చెప్పు లు పెట్టారు. రాత్రి 11 గంటల నుంచి శనివా రం ఉదయం 7 గంటల వరకు రైతు వేదిక వద్ద వేచి చూసిన రైతులకు పోలీసు సిబ్బంది వచ్చి ఈ రోజు యూరియా పంపిణీ లేదని సోషల్ మీడియాలో అధికారులు సమాచారమిచ్చారని చెప్పడంతో రైతులు అక్కడి నుంచి బిక్కుబిక్కుమంటూ వెళ్లిపోయారు. క్యూ లైన్లో పెట్టిన రాళ్లు, కర్రలను పోలీసు సిబ్బంది తీసేశారు. మరిపెడ సొసైటీ వద్ద కూపన్ల కోసం రైతులు ఉదయం నుంచి లైన్లో నిలబడగా, సొసైటీలో స్టాక్ లేకున్నా 400మంది రైతులకు కూపన్లు పంపిణీ చేశారు. సోషల్ మీడియా లో వచ్చే వదంతులను రైతులు నమ్మొద్దని, రోజు వారీగా యూరియా పంపిణీ సమాచారాన్ని ఏఈవోతో ఆయా గ్రామాల్లో తెలియజేస్తామని ఏవో తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పీఏసీఎస్‌కు రోజుల తరబడి యూరియా రాలేదు. రోజూ మాదిరిగానే ము త్తోజిపేట, రాజుపేట, ముత్యాలమ్మతండా, గార్లగడ్డతండా, ద్వారకపేట, నర్సంపేట, సర్వాపురం, నాగుర్లపల్లి, పర్శనాయక్‌తండా, మాధన్నపేట గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు గంపెడాశతో శనివారం తెల్లవారుజామునే సొసైటీకి తరలివచ్చారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా ఎరువు రాకపోవడంతో సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తూ ఇంటిదారి పట్టారు. అదేవిధంగా ఖానాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు సొసైటీ పరిధిలోని చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రాత్రే వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. మధ్యాహ్నం వరకు వేచి ఉన్న రైతులు యూరియా రాదని తెలుసుకొని నిరాశతో ఇంటి బాట పట్టారు. మంత్రి సీతక్క ఇలాకాలో యూరియా దొరకక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కొత్తగూడ మండ లం బూర్కుగుంపు గ్రామానికి చెందిన మల్లెల నర్సయ్య యూరియా దొరకకపోవడంతో మనస్తాపాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.