New Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి చెందిన స్టూడెంట్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) విద్యార్థులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. గురువారం సాయంత్రం చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. జేఎన్యూఎస్యూకు చెందిన 14 మంది అగ్రనేతలు సహా మొత్తం 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అదితి మిశ్రా, మాజీ ప్రెసిడెంట్ నితీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గోపికా బాబు, జాయింట్ సెక్రెటరీ డానిష్ అలీసహా ఇతర నేతలను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితులపై వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యూజీసీ నిబంధనల అమలుపై ఒక పాడ్‌కాస్ట్‌లో ఇటీవల జేఎన్‌యూ వీసీ చేసిన వ్యాఖ్యలు, జేఎన్‌యూఎస్‌యూ నేతలపై నిషేధం, రోహిత్ చట్టం అమలు వంటి వాటిని నిరసిస్తూ జేఎన్‌యూఎస్‌యూ నేతలు గురువారం సాయంత్రం లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి విద్యాశాఖ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరగాల్సి ఉంది. ఈ ర్యాలీకి యూనివర్సిటీ యాజమాన్యం ఒప్పుకోలేదు. క్యాంపస్ బయట ఆందోళన చేసుకోవాలని సూచించింది. అయినప్పటికీ వినకుండా దాదాపు 500 మంది విద్యార్థులు ర్యాలీకి సిద్దమయ్యారు. నినాదాలు చేస్తూ, మెయిన్ గేటు నుంచి విద్యాశాఖ కార్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
వారు బారికేడ్లు అడ్డుపెట్టి ర్యాలీని అడ్డుకోవాలని చూశారు. దీంతో విద్యార్థుల్ని పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకోవాలని చూశాయి. ఈ క్రమంలో పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వారు. కర్రలతో దాడి చేశారు. ఇది అటు పోలీసులు, భద్రతా బలగాలకు.. ఇటు విద్యార్థులకు మధ్య ఘర్షణగా మారింది. ఈ దాడుల్లో కొందరు పోలీసులపై దాడి చేయగా, వారు గాయపడ్డారు. చివరకు కొందరు విద్యార్థి నేతల్ని అరెస్టు చేశారు. ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి, వారిని నియంత్రించారు. మళ్లీ హింసాత్మక ఘటనలు జరగకుండా అదనపు బలగాల్ని మోహరించారు.