గత ఏడాది వరదలకు మోరంచవాగు ఉప్పొంగింది. దీంతో మోరంచపల్లి గ్రామం నీట మునిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వాగుపై ఉన్న మోరంచ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) పనికిరాకుండా పోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్‌పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న 220 మంది రైతుల పొలాలకు నీరందని పరిస్థితి నెలకొంది.
గత వానకాలం, యాసంగి పంటలు కోల్పోయిన అన్నదాతలకు ఈసారీ చుక్కెదురైంది. చెడిపోయిన మోటర్లు, ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి నీటిని ఎత్తి పోస్తారనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం నీరు లేక, రాక పంటలు వేయకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారాయి. పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ లిఫ్ట్ పైనే ఆధారపడిన తమకు దిక్కెవరంటూ ఆందోళన చెందుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)
మోరంచ ఎత్తిపోతల పథకాన్ని 1970లో నిర్మించగా అప్పుడు 1260 ఎకరాల ఆయకట్టుగా నిర్ధారించారు. క్రమంగా ఆయకట్టు తగ్గుతూ వస్తున్నప్పటికీ మోరంచపల్లి పరిసర గ్రామాలకు చెందిన 220 మంది రైతులు దీనిపైనే ఆధారపడి పంటలు పండించుకుంటారు. ఈ ప్రాజెక్ట్ నీట మునగడంతో గత వానకాలం, యాసంగిలో దీని కింద 600 ఎకరాల్లో పంటలు వేయలేదు. రెండు సీజన్లలో కలిపి దాదాపు రూ. 30 కోట్ల వరకు పంటను రైతులు నష్టపోయారు. ఈ వానకాలంలో సైతం నీళ్లు ఎత్తిపోయకపోవడంతో రైతులు తమ భూములను బీళ్లుగా వదిలేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడూ లిఫ్ట్‌కు ఇబ్బందులు ఎదురుకాలేదని, రెండు పంటలు సాగుచేసుకున్నామని వారు చెపుతున్నారు.
మోరంచవాగు ఉప్పొంగడంతో గత ఏడాది జూలైలో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం నీటమునిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోరంచ ఎత్తిపోతల ప్రాజెక్టు సైతం వరద ప్రభావానికి గురైంది. కాలువలో ఉన్న ఎత్తిపోతల బావి కోతకు గురికాగా, మోటర్లు నీట మునిగి ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ బాక్సులు కొట్టుకుపోయాయి. ఈ ప్రాజెక్టుకు వెళ్లే దారి కూడా పూర్తిగా ధ్వంసమైంది.
ఎత్తిపోతల కాలువలకు గండ్లు పడ్డాయి. అయితే లిఫ్ట్‌కు మరమ్మతు చేయాల్సిన అధికారులు ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం లిఫ్ట్ షట్టర్ కూడా తెరవలేదు. రెండు పంటలు కోల్పోయినా, మూడో పంటకు నీరందుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. రూ. 15 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వారంలో నిధులు మంజూరవుతాయని, వెంటనే పనులు ప్రారంభించి వానకాలంలో నీరందిస్తామని టీఎస్ఐడీసీ డీఈ రాజయ్య మూడు నెలల క్రితమే ప్రకటించినప్పటికీ పనుల్లో పురోగతి లేదు.
గత ఏడాది జూలైలో వచ్చిన వరదలకు మోరంచపల్లి గ్రామంతో పాటు ఎత్తిపోతల పథకం మోటర్లు నీట మునిగాయి. ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు సైతం కొట్టుకుపోయింది. దాని మరమ్మతులను అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దీంతో గత వానకాలం, యాసంగికి నీళ్లు లేక పంటలు వేసుకోలేదు. ఇప్పుడు కూడా పంటలు వదిలేసినం. కేవలం లిప్టు పైనే ఆధారపడి 600 ఎకరాలు సాగు చేసుకుంటున్నం. వానకాలంలో నీళ్లిస్తమని డీఈ చెప్పిండు. ఇప్పటికీ అతీగతీ లేదు.
– గాదం సదానందం, మోరంచ ఎత్తిపోతల ప్రాజెక్టు చైర్మన్
వరదలతో లిఫ్ట్ దెబ్బతిన్నది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండు పంటలు కోల్పోయాం. ఇప్పుడు కూడా నీళ్లు అందించక మూ డో పంటనూ వదులుకున్నం. కేవలం లిప్టుపై నే ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నం. పంటలు లేక అప్పుల పాలవుతున్నాం.
– దాసరి రవి, మాజీ సర్పంచ్, మోరంచపల్లి