అగ్ర నటుడు నాగార్జున వందో సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘కింగ్ 100’ ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తన కెరీర్లో మైలురాయిలాంటి సినిమా కావడంతో దీనిపై నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆయన లుక్స్ మొదలుకొని పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుందట. తాజాగా ఈ సినిమా గురించి యువ దర్శకుడు రా కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలో నాగార్జున సూపర్ ైస్టెలిష్‌గా కనిపిస్తారని అన్నారు. ‘ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు అదే స్థాయిలో భావోద్వేగాలు కలబోసిన కథ ఇది. నాగార్జున డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. నటుడిగా ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమా విషయంలో నాగార్జున నమ్మకాన్ని నిలబెడతాను’ అని రా కార్తీక్ అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలకమైన అతిథి పాత్రలో నటిస్తున్నది. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.