ఖానాపురం, అక్టోబర్ 5: పంట కాల్వల నిండా గుర్రపుడెక్క, సిల్ట్ పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో పాకాల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి దాపురించింది. పంట కాల్వలను శుభ్రం చేసి సక్రమంగా నీరందించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 15 రోజులుగా చివరి ఆయకట్టుకు నీరందక పంట లు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
తుంగబంధం కాల్వ పారకం కొత్తూరు గ్రామ శివారు దుంపిళ్లపాయ ప్రాంతంలో 300 ఎకరాల్లో, మండల పరిధిలోని రంగాపురం, చెన్నారావుపేట మండలాల సరిహద్దులోని గంగదేవిపాయ ప్రాంతంలో 300 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేస్తున్నారు. నాట్లు వేసినప్పటి నుంచి నేటి వరకు రైతులకు ఏనాడు పంట కాల్వల ద్వారా సక్రమంగా నీ రందలేదు.
వర్షాల మీ దనే ఆధారపడి రైతులు పంటలను సాగు చేస్తున్నారు. 15 రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దుంపిళ్లపాయ ప్రాం తంలో 200 ఎకరాలో పంటలు ఎండిపోతున్నా యి. బోర్లు, బావుల మీద ఆధారపడి మరో 100 ఎకరాల్లో రైతులు ఎలాగోలా పంటలు పండించుకుంటున్నారు. పాకాల అంటేనే పంట కాల్వల ద్వారా సాగవుతుందనే నానుడి ఉంది. ప్రస్తుతం వర్షాలు, బావులు, బోర్లపై అధారపడాల్సిన పరిస్థితి తయారైందని రైతులు వాపోతున్నారు.
దుంపిళ్లపాయ ప్రాంతంలో తుంగబంధం కాల్వ పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఇరిగేషన్ అధికారులకు పలు సార్లు తమ గోడు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పంట పొట్టదశకు చేరుకుంటున్న ఈ సమయంలో నీరందక పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి దుంపిళ్లపాయ ప్రాంతంలోని పంటలకు నీరందించి ఆదుకోవాలని కోరుతున్నారు.