ఖిలావరంగల్, మార్చి 23: ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన జలాలు అందించాలన్న బృహత్తర లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం నిర్లక్ష్యానికి గురవుతున్నది. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించి తాగునీరు ఇవ్వాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా కొన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందిపడుతున్నారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని విలీన గ్రామమైన ఆదర్శనగర్ ప్రజలకు ఇప్పటికీ మిషన్ భగీరథ తాగునీరు ఎలా ఉంటుందో తెలియదు. అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.
నేటికీ వారు తాగడానికి, వాడుకోడానికి బావి నీటి మీదనే ఆధారపడుతున్నారు. సుమారు 1100 కుటుంబాలు, 1800 ఓటర్లు ఉన్న ఆదర్శనగర్‌కు మిషన్ భగీరథ పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయితే, అధికారులు నీటిని విడుదల చేయడంలో తలెత్తే సమస్యలను అధిగమించకపోవడంతో నల్లాలు నిరుపయోగంగా మారాయి. గ్రేటర్లో విలీనమైన తర్వాత కూడా ఆదర్శనగర్ ప్రజలకు నేటికీ బావి నీరే దిక్కుగా మారింది.
పేదల ప్రభుత్వం అని పదేపదే చెప్పుకునే ప్రజాప్రతినిధులు కనీసం తాగునీటి అందించడం విఫలమయ్యారని స్థానికులు విమర్శించారు. ఊరు చివరన ఉన్న బావికి మోటరు బిగించి తాగునీటిని అందిస్తున్నారు. ఆ బావిలో మూగ జీవాలు పడినా, శుద్ధి చేయకపోయిన స్థానికులకు మరోదారి లేక ఆ నీటినే వాడాల్సిన దుస్థితి దాపురించింది. శివనగర్ నుంచి ఆదర్శనగర్ వరకు సుమారు 7 గేట్‌వాల్వ్‌లు ఉన్నాయి. ఇందులో కనీసం నాలుగు వాల్వ్‌లు మూసివేస్తే ఆదర్శనగర్‌కు పుష్కలంగా భగీరథ తాగునీరు అందుంతుందని నిపుణలు చెబుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. బల్దియా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయకపోతే నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్థానికులు హెచ్చరించారు.
36వ డివిజన్లోని ఏసిరెడ్డినగర్, ఆర్‌ఎస్‌నగర్ లో గుక్కెడు నీటి కోసం ప్రజలు గో స పడుతున్నారు. ఆర్ఎస్నగర్లలో నాలుగు గల్లీల్లో తాగునీరు పూర్తిగా రావడం లేదు. పైపుల మరమ్మ తు కోసం గుంత లు తవ్వి నెలలుగడస్తున్నా పట్టించుకునేవారు లేరని స్థానికులు మండిపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భగీరథ నీరు ప్రెషర్‌తో రాకపోవడంతో మురికి కాల్వల వద్ద పైపులు కట్ చేసి పట్టుకుంటున్నారు. రెండు లేదా మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుందని, వస్తే రెండు బిందెలు కూడా రావడం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛమైన తాగునీటిని పట్టుకోవడానికి మురికి కాల్వలోకి దిగాల్సి వస్తున్నదని ఆర్‌ఎస్‌నగర్ ప్రజలు చెబుతున్నారు. బోర్లు మరమ్మతు చేయాలని అధికారులకు ఫోన్ చేస్తే సిబ్బంది కొరత ఉందని, ఇప్పట్లో కుదరదని చెబుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక ఖిలావరంగల్‌లో తాగునీటి సరఫరా సమయ పాలన లేదు. కోటలో ఎక్కువ సంఖ్యలో వ్యవసాయం, గ్రేయిన్ మార్కెట్, వ్యాపార నిమిత్తం ప్రజలు ఉదయం వెళ్లి సాయంత్రం ఇండ్లకు వస్తుంటారు. అయితే, తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో నీళ్లు పట్టుకునే పరిస్థితి లేదు. దీంతో వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తున్నదని స్థానికులు తెలిపారు.