రాయపర్తి, అక్టోబర్ 28 : తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ (డబుల్ బెడ్రూం గృహాల సముదాయం)కి కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ విషయమై పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలిపిప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం ఖాళీ బిందెలతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. తమకు తాగునీరు సరఫరా చేయాలని పంచాయతీ ఉద్యోగులు, సిబ్బందికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కాలనీవాసులంతా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.