పెద్దవంగర/గార్ల, మే 5 : పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చాలాచోట్ల రోజుల తరబడి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని మెయిన్‌రోడ్ కాలనీ వాసులతో పాటు గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామస్తులు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. నెల రోజులుగా తాగునీళ్లు లేక గోస పడుతున్నామని, ఒక్క ట్యాంకరైనా పంపించండి అంటూ పెద్దవంగర మెయిన్ రోడ్ కాలనీ వాసులు ఎంపీడీవో కార్యాలయం వద్ద రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
అలాగే వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పినిరెడ్డిగూడెం గ్రామస్తులు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, బోరు బావుల్లో నీళ్లు పుష్కలంగా వచ్చేవని, గత పదేళ్లలో ఎప్పుడూ తాగు నీటి కష్టాలు చూడలేదని అన్నారు. మెయిన్‌రోడ్ కాలనీ వాసుల కోసం మూడు బోర్లున్నా వాటికి మోటర్లు లేకపోవడంతో చుక్క నీరు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు బోర్లు, ఇటు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీటిని తీసుకొచ్చుకుంటున్నామని, ఇప్పటికైనా తాగు నీటి గోస తీర్చాలని కోరారు. నిరసనలో మెయిన్రోడ్కాలనీ వాసులు చిలుక యాకమ్మ, రాంపాక రజిత, ధర్మారపు వెంకటమ్మ, రాంపాక సోమనర్సమ్మ, దూదేకుల యాకమ్మ, ఎల్లమ్మ, నారాయణ, కిరణ్, వెంకట్‌రెడ్డి, శంషుద్దీన్, యాకయ్య, వెంకన్న, మల్లేశ్, కమలాకర్ పాల్గొన్నారు.
తాగు నీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలి. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ సమస్య రాలేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కేసీఆర్ స్వచ్ఛమైన నీటిని అందించారు. వారం రోజులుగా నీళ్లు రాక వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగు నీళ్లు తీసుకొస్తున్నాం. మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద కొనుగోలు చేస్తున్నాం. ఇంటికి బంధువులు వస్తే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించాలి
– నూనావత్ జ్యోతి, మాజీ సర్పంచ్, పినిరెడ్డిగూడెం